‘ఈర్ష్య పడేంత సీన్‌ ఏమి లేదు’ | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 29 2018 4:36 PM

BJP Leader GVL Narasimha Rao Firs On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి సేద్యంలో ఏ మేరకు ఫలితం సాధించారో ప్రజలకు చెప్పాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్య సమితిలో పేరు తెచ్చుకుంటే మేము ఈర్ష్య పడుతున్నామన్నారు. ఆయన ప్రకృతి సేద్యంలో ఏమైనా సాధిస్తే కదా ఖ్యాతి...ఇది కేవలం వారికి వారు చేసుకునే ప్రచారం మాత్రమే. దీనికి ఆయన పార్టీ పట్ల జాలి పడడం తప్పా ఈర్ష్య పడేంత సీనేమి లేదు’  అని జీవీఎల్‌ అన్నారు. ఆత్మస్తుతి మానుకుని ప్రజల మీద దృష్టి పెడితే బాగుంటుందని పేర్కొన్నారు.

బాండ్ల విషయంలో పెట్టుబడులు పెట్టింది ఎవరు
అమరావతి బాండ్ల కొనగోలుదారుల పేర్లు ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని జీవీఎల్‌ ప్రశ్నించారు. బాండ్లు పెట్టిందెవరు.. వారి వెనుక ఉందిదెవరో ప్రజలకు చెప్పాలన్నారు. అక్రమాలను రహస్య పత్రాలుగా చెబుతూ జీవోలను బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపించారు. అన్ని ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నాని జీవీఎల్‌ పేర్కొన్నారు. ఇవన్నీ చెబితే ప్రజలు చీత్కరించుకుంటారని భయపడుతున్నారని విమర్శించారు.

బాబు వీటిలో నంబర్‌ వన్‌
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి, అప్పుల్లో, ఆర్భాటాల్లో నెంబర్‌ వన్‌ అని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో మాత్రం చంద్రబాబు లాస్ట్‌ అన్నారు. అనవసరపు ఖ్యాతికోసం పాకులాడితే భంగపాటు తప్పదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి డప్పు కొట్టించుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబును మరోసారి గెలిపించే సాహసం ప్రజలు చేయరని విమర్శించారు.

అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని జీవీఎల్‌ అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలో 6వ పెద్ద ఆర్థిక శక్తిగా తయారయిందన్నారు. మోదీలాగా చంద్రబాబు నాయుడు వరస విజయాలు సాధించారా అని ప్రశ్నించారు. మోదీకి విశ్వసనీయత ఉంది కాబట్టే చంద్రబాబు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. పూర్తిగా గాలిపోయిన సైకిల్‌కి బీజేపి గాలి నింపిందని ఎద్దేవా చేశారు. యూపీలో అఖిలేశ్‌ సైకిల్‌లో గాలి ఎలా పోయిందో.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ గాలిపోయిన సైకిల్‌గా మారిందన్నారు.

Advertisement
Advertisement