
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రుల గ్రహణం త్వరలోనే వీడనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఆదివారం ముషీరాబాద్ బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్న కుమారుడు కాసాని వీరేశం లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ నలుగురు కుటుంబ సభ్యులు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం పంపిన నిధులను కాజేసి తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు నేడు బీజేపీపై విమర్శలు చేస్తున్నార న్నారు.
గత నాలుగున్నర ఏళ్లలో సంపాదించిన అక్రమ సంపాదన ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. మద్యం, ధనప్రవాహాన్ని పారించాలనుకుంటున్నారని.. దీని పట్ల ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండి ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీలో చంద్రబాబు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా సీబీఐకి ఉన్న సాధారణ అనుమతిని ఉపసంహరించారని ఆరోపించారు.
ఏపీలో అక్రమార్కులపై సీబీఐ కొరడా ఝులిపిస్తే టీడీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. సీబీఐ దాడుల్లో వెలుగుచూసిన అక్రమాలపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇద్దరు చంద్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాలకు చంద్రగ్రహణం పట్టిందని, త్వరలోనే ఇది వీడి కమలం వికసిస్తుందన్నారు.
20న అమిత్‌షా..
ఇప్పటివరకు బీజేపీ 114 మంది అభ్యర్థులను ప్రకటించిందని మరో ఐదుగురిని సోమవారం ఉదయం ప్రకటిస్తుందని లక్ష్మణ్ తెలిపారు. ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారం (20న) తెలంగాణకు వస్తున్నారని, రెండు బహిరంగ సభలు రోడ్‌షోలో పాల్గొంటారని తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెల 3, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. 3న మూడు బహిరంగ సభలు, 5న రోడ్‌షోలు ఉంటాయన్నారు. మరో రెండు సభలకు రావాలని ప్రధాని మోదీని కోరుతున్నట్లు తెలిపారు. వీరితో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.
25 మందితో బీజేపీ ఐదో జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగా ణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 25 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఐదో విడత జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జేపీ నడ్డా ఈ మేరకు ఆదివారం సాయంత్రం జాబితా విడుదల చేశారు. ఇటీవలే టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అరుణతార ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇప్పటివరకు 118 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
నియోజక వర్గాలవారీగా అభ్యర్థుల వివరాలు
జుక్కల్(ఎస్సీ): అరుణ తార, బాన్స్‌వాడ: నాయుడు ప్రకాష్, బాల్కొండ: ఆర్.రాజేశ్వర్, మంథని: రెండ్ల సనత్‌కుమార్, చొప్పదండి(ఎస్సీ): బొడిగె శోభ, మహేశ్వరం: అందెల శ్రీరాములు యాదవ్, వికారాబాద్(ఎస్సీ): రాయిపల్లి సాయికృష్ణ, జడ్చర్ల: డాక్టర్ మధుసూదన్ యాదవ్, కొల్లాపూర్: సుధాకర్ రావు, దేవరకొండ(ఎస్టీ): డాక్టర్ జరుప్లవత్ గోపి (కల్యాణ్ నాయక్), మిర్యాలగూడ: కర్నాటి ప్రభాకర్, హుజూర్‌నగర్: బొబ్బ భాగ్యరెడ్డి, కోదాడ: జల్లెపల్లి వెంకటేశ్వరరావు, తుంగతుర్తి(ఎస్సీ): కడియం రాంచంద్రయ్య, జనగామ: కె.వి.ఎల్.ఎన్.రెడ్డి(రాజు), డోర్నకల్(ఎస్టీ): జి.లక్ష్మణ్ నాయక్(లచ్చిరాం), వరంగల్ ఈస్ట్: కుసుమ సతీశ్, ములుగు(ఎస్టీ): బానోత్ దేవీలాల్, కొత్తగూడెం: బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంచిర్యాల: వి.రఘునాథ్‌రావు, బోధన్: అల్జాపూర్ శ్రీనివాస్, నర్సాపూర్: ఎస్ గోపి, కుత్బుల్లాపూర్: కాసాని వీరేశ్, పరిగి: కరణం ప్రహ్లాద్‌రావు, కంటోన్మెంట్: శ్రీగణేశ్.