
శ్రీరామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు గురువు వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. గురుకులం నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాముడు తండ్రి అనుమతితో తమ్ముళ్లను వెంట బెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్ళాడు. అనేక మున్యాశ్రమాలు, పుణ్య నదులు, దేవా లయాలు దర్శించి అయోధ్యకు చేరు కున్నాడు. ఆ తర్వాత శ్రీరామునిలో గొప్ప మార్పు వచ్చింది. తోటి బాలురతో ఆడటం మానేశాడు. ఎవరితోనూ మాట్లాడడు. ఎప్పుడూ పద్మాసనంలో కూర్చుని, ఏదో దీర్ఘాలోచనలో ఉండేవాడు.
అలా ఉండటానికి కారణం ఏమిటని తండ్రి దశరథుడు అనునయంగా ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పడు. దశరథుడు, వశిష్ఠునితో చర్చించాడు. ఆయన రాముని ‘ఈ విచిత్ర ప్రవర్తనకు కారణం ఏదో ఉండే ఉంటుంది. నెమ్మదిగా తెలుసుకోవాలి’ అంటాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడు తన యజ్ఞ రక్షణకు రాముని పంపమని దశరథుని అడగటానికి వచ్చాడు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో సంభాషిస్తూ... తీర్థయాత్రల నుంచి వచ్చిన దగ్గర నుంచి తనలో ఒక విచారణ ఉత్పన్నమైనదనీ, ప్రాపంచిక విషయాల పట్ల తనలో అనాసక్తి ఏర్పడిందనీ, ధనాదులు, సంపదలు శాశ్వతానందాన్ని ఇవ్వక పోగా ఇంకా అజ్ఞానారణ్యం లోకి తోసి వేస్తున్నాయనీ చెబు తాడు. తామరాకు మీద నీటి బొట్టులా నిర్లిప్తంగా ఉండే మార్గం ఏదీ? అని అడుగుతాడు. శ్రీరామునిలో ఈ వైరాగ్యాన్ని చూసి అతడికి ఆత్మ విచారణ తత్వాన్ని బోధించమని వశిష్ఠునితో చెబుతాడు విశ్వామిత్రుడు.
అప్పుడు ఒక సభా వేదికను ఏర్పాటు చేసి, వశిష్ఠుడు జ్ఞానయుక్త వైరాగ్యంతో కర్మ వైముఖ్యం పొందిన శ్రీరామునికి జ్ఞాన, కర్మలు రెండూ వేరు కావనీ, ఒకే పక్షికున్న రెండు రెక్కల వంటివనీ బోధించి కర్తవ్యోణ్ముఖుని చేయటానికి ప్రేరణాత్మక కథలనూ, ఆత్మ విచారణ తత్వాన్నీ బోధించాడు. ఈ కథల సారమే యోగవాశిష్ఠంగా ప్రఖ్యాతమైంది.
– డా. చెంగల్వ రామలక్ష్మి