యశ్వంత్‌ కామెంట్లపై బీజేపీ, జైట్లీ స్పందన

BJP and Jaietly Reaction on Yashwant Sinha's remarks - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్‌ సిన్హా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీకి ఆయుధంగా మారాయి. సొంత చేసిన కామెంట్లను ఎక్కుపెట్టి బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే ఆయన వ్యక్తిగతంగా మనోవేదనతోనే అలా మాట్లాడి ఉంటారని బీజేపీ చెబుతోంది.

బీజేపీ జాతీయ ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్‌ స్పందిస్తూ... పదేళ్ల యూపీఏ ప్రభుత్వం అవినీతిమయమన్నది అందరికీ తెలిసిందే. రాహుల్‌ గాంధీ, చిదంబరంతోపాటు పని లేని మరికొందరు అదే పనిగా ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారు. బహుశా వ్యక్తిగతంగా వైఫల్యం చెందిన ఆ బాధతోనే వాళ్లు అలా మాట్లాడుతున్నారేమో అని యశ్వంత్‌ సిన్హాను ఉద్దేశించి పరోక్షంగా గోపాలకృష్ణ పేర్కొన్నారు. 

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అంశాలతోపాటు జీడీపీపై కూడా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ చాలా స్పష్టమైన ప్రకటనలు చేశారు. నష్టాలు ఏవీ ఉండబోవని భరోసా ఇస్తూనే ప్రజల అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. అలాంటప్పుడు  ఆయన (యశ్వంత్‌) అలా మాట్లాడటం సరికాదని అగర్వాల్‌ చెప్పుకొచ్చారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో మోదీ ప్రభుత్వం నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ మునిగిపోయిందంటూ కథనం రాసిన బీజేపీ సీనియర్‌ నేత తర్వాత ‘ఇండియా @ 70..  మోదీ @3.5 అనే పుసక్తావిష్కరణలో సొంత పార్టీపై చేసిన విమర్శలను సమర్థించుకున్నారు కూడా. కేంద్ర మాజీ మంత్రిగా తానేం రాజభోగాలు అనుభవించటం లేదంటూనే మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేయటం గమనార్హం.   

జైట్లీ స్ట్రాంగ్‌ రియాక్షన్‌...

తనపై వ్యక్తిగతంగా యశ్వంత్‌ సిన్హా చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఘాటుగానే స్పందించారు. ముందు కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసిన ఆయన.. తర్వాత యశ్వంత్‌ ను వదల్లేదు. యూపీఏ హయాంలోని పాలసీలన్నీ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినవే. ప్రస్తుతం ఎన్టీయే హయాంలో వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం అని జైట్లీ చెప్పారు. ఇక యశ్వంత్‌ను ఉద్దేశించి ఆయన ఆవిషర్కించిన పుస్తకానికి ‘ఇండియా @ 70..  మోదీ @3.5 నిరుద్యోగి @80’ అని పెట్టాల్సిందంటూ జైట్లీ వ్యంగ్య కామెంట్‌ చేశారు. మూడేళ్ల మోదీ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయన్న జైట్లీ.. గతంలో ఆర్థిక మంత్రిగా సిన్హా నిర్వర్తించిన బాధ్యతల కంటే తాను మెరుగ్గా పని చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు యశ్వంత్‌ తనయుడు జయంత్‌ సిన్హా తండ్రి వ్యాఖ్యలను ఖండించటం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top