టీడీపీకి మరో భారీ షాక్‌..!

Big Shock to TDP, Modugula Venugopal Reddy Resigns From Party - Sakshi

ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి మోదుగుల రాజీనామా

ఈ నెల 8న వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం

సాక్షి, గుంటూరు : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను శాసనసభ స్పీకర్, టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపించారు. దీంతో జిల్లా టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మోదుగుల టీడీపీని వీడతారంటూ రెండేళ్లుగా ఆ పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేస్తూ వచ్చింది. 15 రోజులుగా ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద జరిగిన గుంటూరు పార్లమెంట్‌ సమీక్షకు సైతం మోదుగుల గైర్హాజరయ్యారు. రెండు రోజుల క్రితం కార్యకర్తల సమావేశం నిర్వహించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ సైతం మోదుగుల టీడీపీని వీడతారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మోదుగుల తన రాజీనామా పత్రాలను శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, సీఎం చంద్రబాబుకు పంపడంతో ఉత్కంఠకు తెరపడినట్లయింది.

ఈ నెల 8న ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. కాగా, అధికారంలో ఉన్న ఈ నాలుగున్నరేళ్లపాటు మోదుగులకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. పార్టీలోని ఓ సామాజికవర్గం నేతలు ఆయనకు అడ్డుపడుతూ వచ్చారు. తన నియోజకవర్గ పరిధిలోని నామినేటెడ్‌ పోస్టుల నుంచి పార్టీ పదవుల వరకు.. చివరికి అధికారుల బదిలీల్లోనూ ఆయన మాట చెల్లనీయలేదు. దీంతో ఇక టీడీపీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం టీడీపీ డివిజన్‌ అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశమైన మోదుగుల పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను వివరించారు. ఇక టీడీపీలో కొనసాగలేనని వారితో చెప్పడంతో అధిక శాతం మంది నాయకులు, డివిజన్‌ అధ్యక్షులు ‘ఏ పార్టీలో ఉన్నా మీ వెంటే ఉంటా’మంటూ మోదుగులకు మద్దతు పలికారు. అనంతరం హైదరాబాద్‌ వెళ్లిన మోదుగుల టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలవడం దారుణమైన విషయమని మోదుగుల ‘సాక్షి’తో అన్నారు. త్వరలో మంచి రోజు చూసుకుని వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top