
జయప్రకాశ్ ముజుందార్, మాలినీ భట్టాచార్య, గార్గా ఛటర్జీ
కోల్‌కత : వచ్చే ఎన్నికల్లో కారల్ మార్క్స్, మమతా బెనర్జీ, నరేంద్ర మోదీల్లో ఎవరి సిద్దాంతాలు కావాలో బెంగాల్ ప్రజలు తేల్చుకోవాలని పశ్చిమబెంగాల్ బీజేపీ వైస్-ప్రెసిడెంట్ జయప్రకాశ్ మజుందార్ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన కాన్‌క్లేవ్ ఈస్ట్ -2018 చర్చా కార్యక్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ విఫలమైందనిపై ఆయన విమర్శలు గుప్పించారు. మమత పాలనలో మత ఘర్షణలు తీవ్రమయ్యాయని ఆరోపించారు.
మమతా..మోదీ సిద్ధాంతాలు..!
‘మార్క్స్ సిద్ధాతంతం ప్రకారం మతం అనేది ప్రజలకు మత్తులాంటిది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకారం మతం అనేది ఓటు బ్యాంకు మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకారం మతం అనేది సమజానికి వెన్నుముక, మతం అనేది ఒక పవిత్రమైన విధానం’అని ముజుందార్ వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం సీపీఎం కథ ముగిసిందని అన్నారు. బెంగాల్ భవిష్యత్తు బీజేపీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.
మీరు ప్రభుత్వం నడపడం లేదా..!
బెంగాల్‌లో అశాంతికి, మత ఘర్షణలకు మతతత్వ బీజేపీ కారణమని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కార్గా ఛటర్జీ ఆరోపించారు. రాష్ట్రేతర శక్తుల మూలంగానే బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తృణమూల్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని అన్నారు. ఛటర్జీ వ్యాఖ్యలను మజుందార్ ఖండించారు. బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్న టీఎంసీ బెంగాల్‌లో అధికారం లేదా అని ఎద్దేవా చేశారు. అసమర్థ పాలన సాగిస్తున్న మమత బెనర్జీ ప్రభుత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పాడనున్నారని అన్నారు. కాగా, ఇటీవల బెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.