‘చంద్రబాబుపై హత్య కేసు పెట్టాలి’

Attempt To Murder Case Should File On Chandrababu Says YS Jagan - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : గోదావరి నదిలో లాంచీ ప్రమాదంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ప్రజాసంకల్పయాత్రలో పాదయాత్ర చేస్తున్న ఆయన రామారావు గూడెం వద్ద మీడియాతో మాట్లాడారు.

గడచిన ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఇది మూడో పడవ ప్రమాదమని, లైసెన్స్‌ లేని బోట్లు ఎలా తిరుగుతున్నాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పాలన లోపం వల్ల జరిగిన ఈ ఘటనలు అన్ని ప్రభుత్వం చేసిన హత్యలేనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వరుసగా బోటు ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం నిద్రపోతోందా? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి టీడీపీ నేతల వరకూ లంచాలు తీసుకోవడం వల్లే ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 21 మంది బలయ్యారని, చంద్రబాబు సినిమా షూటింగ్‌ కోసం చేసిన పని వల్లే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తొక్కిసలాటపై విచారణ ఏమైందో తెలియడం లేదని చెప్పారు. ఈ ఘటన విచారణ జరిగితే చంద్రబాబుది తప్పు అని తేలుతుందని అన్నారు. అందుకే విచారణ నివేదిక బయటకు రావడం లేదని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేతలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు లాంచీ ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top