ఆ వర్గాలపై దాడులు పెరుగుతున్నాయ్‌: ఉత్తమ్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని, దళిత, గిరిజన, బడుగు, బలహీల వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. 133 వ జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గాంధీ భవన్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో..సీఎల్పీనేత జానారెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ,  యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సేవదల్ ఛైర్మెన్ జనార్దనరెడ్డి తదీతరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి 133 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. దేశానికి స్వాతంత్రం తేవడంలో, తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పాత్ర క్రియాశీలకమైందన్నారు. అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ గురించి అన్ని పార్టీలు ఒప్పుకున్నా కూడా సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోలేదని గుర్తు చేశారు. మందకృష్ణను  అక్రమంగా అరెస్ట్ చేసి అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టారని విమర్శించారు.

పొంగులేటి సుధాకర్ రెడ్డి(ఏఐసీసీ కార్యదర్శి) మాట్లాడుతూ..

దేశంలో గాడ్సే వాదుల ఆగడాలు ఎక్కువయ్యాయని, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే మాట్లాడటం దారుణమన్నారు.అనంతకుమార్ హెగ్డే ను తక్షణం బర్తరఫ్ చేయాలని కోరారు. అంబెడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కించపరచడం అంటే మనకళ్లు మనము పొడుచుకోవడమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

కుందూరు జానారెడ్డి(శాసనసభాపక్ష నాయకుడు) మాట్లాడుతూ..

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమి మనదేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిదని అన్నారు. లౌకికవాదం, ప్రజాసామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. దేశరక్షణ రంగాన్ని పటిష్ట పరిచి మన శతృదేశాలకు దీటుగా సమాధానం చెప్పగలిగే స్థాయికి దేశాన్ని తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.

షబ్బీర్ ఆలీ(శాసనమండలి ప్రతిపక్షనేత) మాట్లాడుతూ...

సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహించలేమని ప్రభుత్వం చేతులెత్తాయడం సిగ్గు చేటన్నారు. సైన్స్ కాంగ్రెస్ మణిపూర్ తరలిపోవడం తెలంగాణకు అవమానకరమని వ్యాఖ్యానించారు. ఓయూలో నిరసనలకు భయపడి కేసీఆర్ సైన్స్ కాంగ్రెస్‌కు నో చెప్పారని విమర్శించారు. ఓయూ పట్ల కేసీఆర్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని,  కేసీఆర్ దృష్టిలో ఓయూలో రౌడీలు ,టెర్రరిస్టులు ఉన్నారా అని ప్రశ్నించారు. సర్కార్ తీరుతో ఓయూ, తెలంగాణ పరువు పోయిందని, కేసీఆర్ ఓ అసమర్థ  సీఎంగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు.

మల్లు భట్టి విక్రమార్క(టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌) మాట్లాడుతూ..

జాతి సమగ్రతకై కొట్టుకునే వారికి కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు ఓ పండుగ అని వ్యాఖ్యానించారు. రాహుల్ నాయకత్వంలో తెలంగాణాలో, కేంద్రంలో 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. పోలీసు వలయంలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, తెలంగాణాలో ప్రజాస్వామ్యం లేదన్నారు. రాజ్యాంగాన్ని మార్చుతామంటున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ రాజద్రోహి అని అన్నారు. కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి మార్పు దిశగా నడిపిస్తున్నకాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం అనే బలమైన పునాదులపై ఏర్పడిందన్నారు. జాతిని విభజించి అధికారం కోసం ఆరాటపడుతున్న పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ ఏకత్వం కోసం పనిచేస్తుందని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top