ఆ ‘ముగ్గురి’కీ అవార్డులు! | Atchannaidu, Chintamaneni Best Leaders In TDP Survey | Sakshi
Sakshi News home page

ఆ ‘ముగ్గురి’కీ అవార్డులు!

May 13 2018 11:51 AM | Updated on Aug 11 2018 4:32 PM

Atchannaidu, Chintamaneni Best Leaders In TDP Survey - Sakshi

సాక్షి, అమరావతి: వివిధ కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు బాగా పనిచేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు కితాబు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై వేధింపులు, తీవ్ర అవినీతికి పాల్పడినవారు, మాఫియాగా మారి ఇసుకను దోచేస్తున్న నాయకులు, ఇరిగేషన్‌ కాంట్రాక్టులు దక్కించుకుని రూ.వేల కోట్లు దోచి సీఎం చంద్రబాబుకు వాటా ఇస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులపైన సీఎం ప్రశంసలు కురిపించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

శుక్రవారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరుపై గత మూడు నెలల కోసం సర్వే నిర్వహించామని చంద్రబాబు తెలిపారు. అందులో ముగ్గురు, నలుగురు బాగా పనిచేశారంటూ వారి పేర్లను ఆయన స్వయంగా చదివి వినిపించారు. వారిలో రాష్ట్రంలోనే వివాదాస్పద ఎమ్మెల్యేగా రికార్డులకెక్కిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పేరు ఉండడం గమనార్హం. అధికారులు, సాధారణ పౌరులపై దాడులు, దౌర్జన్యాలతో రౌడీ రాజకీయం నడిపిస్తూ చింతమనేని ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తుండడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే.

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేయడం నుంచి ఇటీవల హనుమాన్‌ జంక్షన్‌లో ఆర్టీసీ బస్సుపై అంటించిన పోస్టర్‌లో చంద్రబాబు బొమ్మ చిరిగిపోయిందని కండక్టర్, స్థానికులపై చేయిచేసుకునే వరకు ఆయన చేసిన అరాచకాలకు అంతే లేదు. మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి చేసిన కేసులో ఇటీవలే భీమడోలు కోర్టు ఆయనకు మూడేళ్ల శిక్ష విధించింది. అలాంటి వ్యక్తిని ఉత్తమ నాయకుడిగా ప్రకటించడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌) అనే సంస్థ దేశవ్యాప్తంగా వెలువరించిన మహిళలపై అఘాయిత్యాలు చేసిన ఎమ్మెల్యేల జాబితాలో చింతమనేని పేరు ప్రముఖంగా ఉంది. ఆయనపై 23 కేసులున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, బండారు సత్యనారాయణమూర్తిపై ఉన్న కేసులు, వారి ఆగడాలను వివరించింది. కాగా.. ఉత్తమ పనితీరు కనబరిచిన వారిలో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆయనపై ఏకంగా ఒక ఐఏఎస్‌ అధికారిణిని లైంగికంగా వేధించిన ఆరోపణలున్నాయి. నోటి దురుసుతో ఇష్టానుసారం మాట్లాడే అచ్చెన్నను చూసి అందరూ పద్ధతి నేర్చుకోవాలని చంద్రబాబు చెప్పడంతో టీడీపీ సీనియర్‌ నేతలు బిత్తరపోయారు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను దుర్భాషలాడడమే తన రోజువారీ పనిగా పెట్టుకుని మీడియా సమావేశాలతో విసుగుపుట్టించే మంత్రి దేవినేని ఉమాను ఉత్తమ ప్రజెంటర్‌గా ఎంపిక చేశారు. ప్రతిపక్షాన్ని దుమ్మెత్తి పోస్తున్నందుకు ఆయనకు కితాబు లభించింది. దీనిపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వైఎస్‌ జగన్‌ను తన కంటే ఎవరూ బాగా తిట్టలేదని, రోజుకు రెండు, మూడు మీడియా సమావేశాలు పెట్టి మరీ దుమ్మెత్తిపోస్తున్నా తనను కాకుండా దేవినేనిని ఎలా ఉత్తమ ప్రజెంటర్‌గా ఎంపిక చేస్తారని ఆయన వర్గం వాదిస్తోంది. వివాదాల్లో మునిగితేలే నాయకులు, దుర్భాషల్లో ఆరితేరినవారు బాగా పనిచేస్తున్నారని సీఎం చెప్పడం టీడీపీ నేతలకు మింగుడుపడడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement