‘ఏపీ మంత్రులు కూడా ఒప్పుకున్నారు’

AP Ministers Are Agreed About Agri gold Properties - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ సర్కార్‌ దుర్మార్గపు ఆలోచనల కారణంగా అగ్రిగోల్డ్‌ బాధితులు నేటికీ ఇబ్బందులు పడుతున్నారని, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడితే మాత్రం.. వెంటనే ఆ రోజు మంత్రులు స్పందిస్తారని వైఎస్సార్‌సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వారి పని స్పందించడం వరకేనని, న్యాయం మాత్రం చేయరంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశమైంది. అనంతరం కమిటీ కన్వినర్‌ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పదవుల్లో ఉన్న వాళ్లు, మంత్రులు కూడా అగ్రిగోల్డ్‌ అప్పుల కంటే ఆస్తుల విలువ అనేక రెట్లు ఉందని చెప్పిన విషయాన్ని అప్పిరెడ్డి గుర్తుచేశారు. 

‘అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశం సీఎం చంద్రబాబుకు ఏ కోశాన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఇటీవల గుంటూరు జిల్లాలో ఇద్దరు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తుంది. ఢిల్లీలో చంద్రబాబును అమర్‌సింగ్‌ కలిసిన తర్వాతే ఎస్‌ఎల్‌ గ్రూపు అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొనుగోలు చేయమని చెప్పింది. కొందరు సంస్థ ఆస్తులను చవకగా కొట్టేయాలని చూస్తున్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు కలిసొచ్చిన పార్టీలతో వైఎస్సార్‌సీపీ భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తుందని’  అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వినర్‌ తెలిపారు.

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉండి ఉంటే..
ఐదు రాష్ట్రాల్లో ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితుల సమావేశం ఇక్కడ జరిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కార మార్గం కోసం వైఎస్సార్‌ సీపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ప్రజల ఆస్తుల్ని ఎలా కాజేయాలన్న ఆలోచన తప్పా.. వారిని ఆదుకోవాలన్న ఆలోచన ఏపీ ప్రభుత్వానికి రాలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే 1100 కోట్లు ఖర్చు చేస్తే 16 లక్షల మంది బాధితులు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారని వైఎస్సార్‌సీపీ సూచించినట్లు తెలిపారు. పుష్కరాలకు వేలకోట్లు, సీఎం క్యాంప్‌ ఆఫీసు, గెస్ట్‌హౌస్‌లకు, విదేశీ పర్యటనల ఖర్చులతో పోల్చితే ఇదేమంత పెద్ద ఖర్చు కాదని చంద్రబాబుకు పార్థసారథి సూచించారు.

చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో ఏ పని అయినా చేస్తారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అగ్రిగోల్డ్ విలువైన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భాదితులకు చెల్లింపులు చేయడం కష్టసాధ్యమేం కాదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులని చవకగా కొట్టేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు చంద్రబాబు మీకు వినిపించడం లేదా అని  వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ ప్రశ్నించారు. బాధ్యత గల సీఎంగా వ్యవహరించి.. చంద్రబాబు ఇప్పటికైనా బాధితులకు న్యాయం చెయ్యాలని సూచించారు.

టీడీపీ సర్కార్‌ చేస్తున్న భిన్న ప్రకటనలతో అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతున్నాయని మజ్జి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ తగ్గించి చెప్పడం సరికాదన్నారు. బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలు మాత్రం పరిష్కార మార్గం కాదని హితవు పలికారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top