ఇంటెలిజెన్స్‌తో సంబంధంలేని పోలీసు విధులు ఉంటాయా?

AP CEO Gopalakrishna Dwivedi Sensational Comments - Sakshi

సాక్షి, అమరావతి :  ఎన్నికల సంఘం పరిధిలోకి ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని తీసుసురాకపోవడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగంతో సంబంధంలేని పోలీసు విధులు ఉంటాయా అని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేస్తూ కీలక అంశాలు చర్చించారు. పోలీసు కదలికలు, ఎన్నికల సిబ్బంది తరలింపు, శాంతి భద్రదల నియంత్రణ కచ్చితంగా ఇంటెలిజెన్స్‌తోనే ముడిపడి ఉంటుందని పునరుద్ఘాటించారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యతో ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబందం ఉండదా అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం పోలీసులు వ్యవస్థ ఉండి.. ఇంటెలిజెన్స్‌కు ఎన్నికల సంబంధం లేదంటే ఎలా అని నిలదీశారు. రాష్ట్రంలో జరగుతున్న సంఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రతి అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తున్నామని తెలిపారు. 

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు సర్కారు బుధవారం వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం వివాదాస్పద జీవో జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇంటెలిజెన్స్‌ డీజీపై వేటు

సీఈసీ ఆదేశాలతో వెంకటేశ్వరరావుతో పాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్‌ శర్మ, వెంకటరత్నంలను రిలీవ్‌ చేస్తూ మంగళవారం రాత్రి జీవో 716 విడుదల చేసింది. తెల్లారేసరికి ప్లేటు మార్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి రారని మెలిక పెట్టింది. నిన్నటి జీవోను రద్దు చేస్తూ నేడు వివాదాస్పద జీవో 720 జారీ చేసింది. ఇవాళ్టి జీవోలో వెంకటేశ్వరరావు పేరును తప్పించింది. ఆయనను రిలీవ్‌ చేయడం లేదని.. వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను మాత్రమే రిలీవ్‌ చేస్తున్నట్టు అందులో పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top