ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Special session Begins - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగోరోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక అసమానతల వల్ల కొంతమంది వెనకబడ్డారని, సమాజంలోని ఈ అసమానతలు తగ్గాలంటే విద్య చాలా అవసరమని తెలిపారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్‌ విద్య అవసరమని తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి అంటూ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైనదని, హర్షించదగిందని అన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకంతో విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన మెనూతో విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుందని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం వల్ల వారి సామర్థ్యం పెరుగుతుందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల్లో వసతులు మెరుగవుతున్నాయని, ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల్లలో డ్రాపౌట్స్‌ తగ్గుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్య మీద ఎంతో శ్రద్ధ పెట్టి.. ప్రాధాన్యమిస్తున్నారని, ఆయన తీసుకొస్తున్న పథకాలు ప్రజల తరతరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని అన్నారు. 

నిరక్షరాస్యత రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం..
సభ్యుడు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్‌ విద్య ఒక ఆస్తి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇంగ్లిష్‌ చాలా అవసరం. సమాజంలోని నిరక్షరాస్యత రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం. పేద విద్యార్థులకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం. సమాజంలోని అసమానతలు విద్య వల్ల తగ్గుతాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ దేశ నిండుభారతిని అన్న కవి భావాలను నిజం చేయాలంటే అందుకు ఇంగ్లిష్‌ విద్య కూడా అవసరం. ప్రపంచ భాష అయిన ఇంగ్లిష్‌ రాకపోతే మన ఔన్నత్యాన్ని అందరికీ చాటిచెప్పలేం’ అని పేర్కొన్నారు.

రైతు కొడుకు ఇంజినీర్‌ కావాలని..
సభ్యుడు కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘పేదలు తమ పిల్లల్ని చదివించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అప్పులు చేసి ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. చాలామంది ఊళ్లను నుంచి పిల్లలను పట్టణాలకు పంపించి.. అక్కడ చదివిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. పదో తరగతికి వచ్చేవరకు ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని నిలబడే విధంగా శిక్షణ పొందుతున్నారు. జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకునేవిధంగా తయారవుతున్నారు. చాలచోట్ల ప్రైవేటు పాఠశాలలు ఏమాత్రం వసతులు లేకుండా పశువుల కొట్టాంలా ఉన్నాయి. కానీ పెద్దమొత్తంలో ఫీజలను ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం చాలా అవసరం. రైతు కొడుకు ఇంజినీర్‌ కావాలని, రిక్షావాడి కొడుకు కూడా డాక్టర్‌ కావాలని, పేద విద్యార్థులు కూడా పెద్ద పెద్ద చదువులు చదవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అంబేద్కర్‌ కలల సమాజాన్ని సీఎం జగన్‌ సాకారం చేస్తున్నారు’ అని అన్నారు.

సభ్యుడు గొల్లబాబురావు మాట్లాడుతూ.. విద్యారంగంలో సంస్కరణలతో భావితరాలకు మేలు జరుగుతుందని అన్నారు. విద్య అనేది అభివృద్ధికి పునాది అని, అందుకే విద్యలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణల వల్ల సమాజంలో ఎన్నో మంచి మార్పులు వస్తాయని తెలిపారు. పేదవర్గాల సంక్షేమం కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఇంగ్లిష్‌ విద్య పేదలకు వరం లాంటిదని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేయడాన్ని స్వాగతించారు.

సభ్యుడు తిప్పేస్వామి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ఇంగ్లిష్‌ చదువు రావాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియం బిల్లును తీసుకొచ్చిందన్నారు. బిల్లు ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యలో తెలుగు మీడియంలో ఉండి, ఉన్నత విద్య ఇంగ్లిష్‌ మీడియంలో ఉండటం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సాగించాల్సి ఉందని, అందుకు వీలుగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని వివరించారు. సభ్యుడు బుడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతకాలంలో ఇంగ్లిష్‌ విద్య తప్పనిసరి అయిందని, ఇంగ్లిష్‌ విద్య పేద విద్యార్థులకు ఓ వరమని కొనియాడారు.

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను మండలి చైర్మన్‌ షరీఫ్‌ బుధవారం అర్ధంతరంగా సెలెక్ట్‌ కమిటీకి నివేదించి.. మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మాత్రమే నేడు కొనసాగనున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top