మన దేశమేమీ ధర్మశాల కాదు: గడ్కరీ

All the People in India are Hindus: Nitin Gadkari - Sakshi

న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఉన్న అనుమానాలను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కొట్టిపారేశారు. మంగళవారం ఆజ్‌తక్‌ చానెల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై స్పష్టతనిచ్చారు. ప్రభుత్వం ఏ మైనారిటీకి వ్యతిరేకం కాదని, ఏ ముస్లింను దేశం నుంచి పంపించే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. ‘ఈ చట్టం గురించి ప్రజలు తప్పుడు సమాచారంతో ప్రభావితమైనారని భావిస్తున్నాను. రాజకీయ కారణాలతో కొన్ని శక్తులు వారిని రెచ్చగొడుతున్నాయి. మైనార్టీలు వారి ఉచ్చులో పడకూడదు. అక్రమ వలసదారులను అమెరికాతో సహా ఏ దేశం కూడా రెడ్‌ కార్పెట్‌ పరచదు. మన దేశమేమీ ధర్మశాల కాదు. అసలు ఈ చట్టం మన పౌరుల గురించి కాదు. పాక్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాలలోని మైనారిటీల గురించి. హింస కారణంగా అక్కడ వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. వారు ఎక్కడికీ వెళ్లలేరు కాబట్టి వారు ఇక్కడకు వస్తే వారికి పౌరసత్వం ఇస్తున్నామ’ని వివరించారు. 

ప్రశ్నపౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్త నిరసనలపై మీ అభిప్రాయం?
గడ్కరీ
: అభద్రతాభావానికి గురైన కొంతమంది రాజకీయ నాయకులు మైనార్టీల మనసులో భయాన్ని, అభద్రతను సృష్టిస్తున్నారు. జాతీయ సమస్యపై వారు ఇలా చేయడం భావ్యం కాదు. ఈ చట్టం ఏ భారతీయ పౌరుడిపై కులం, మతం, లింగం, ప్రాంతం ఆధారంగా వివక్ష చూపదు. ఇది కేవలం దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు మాత్రమే వ్యతిరేకం. దీనికి శాంతియుత ముగింపు వస్తుందని అనుకుంటున్నా.

ప్రశ్న : ‘క్యాబ్‌’పై ప్రతిపక్షాల తీవ్ర స్పందనపై మీ అభిప్రాయమేంటి?
గడ్కరీ : కొందరు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మైనార్టీలలో భయాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. నిరాధార ప్రకటనలు చేస్తూ రాజకీయ లాభం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

ప్రశ్నభారత్‌ను హిందూ రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై..
గడ్కరీ : హిందూ రాష్ట్రం అంటే ఏమిటి? కొన్ని మీడియా సంస్థలు.. రాజకీయ పార్టీలు హిందూను, హిందుత్వను తప్పుగా వ్యాఖ్యానిస్తున్నాయి. హిందుత్వ అంటే ఒక జీవన విధానంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. హిందుస్తాన్‌లో నివసిస్తున్న ఏ మతానికి చెందినవారైనా వారంతా హిందువులే. కాబట్టి హిందూ, హిందుత్వలతో ఎలాంటి సమస్య లేదు.

ప్రశ్న: ఎన్‌ఆర్‌సిపై ఏమంటారు?
గడ్కరీ
: అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అనేక మంది అక్రమ వలసదారులకు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వారికి పౌరసత్వం లభించింది. పెద్ద సంఖ్యలో ఓటర్ల సంఖ్య పెరగడానికి కారణం అదే. ఈ విషయంపై అస్సాంలో ఇంతకు ముందు నిరసన వ్యక్తమైంది. అయినా అనంతర పరిణామాల్లో వారికి ఓటుహక్కు కూడా లభించి వారిలో కొందరు చివరికి రాష్ట్ర అసెంబ్లీ వరకు చేరుకున్నారు.

ప్రశ్న ఆర్థిక మందగమనం నుండి దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని తీసుకువచ్చిందా? 
గడ్కరీ :  ఇది ఒక సమగ్ర విధానం. భద్రతతో కూడిన ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమే. ప్రభుత్వం ఎప్పుడూ ఒకే అంశంపై పనిచేయదు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ. ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మారేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. అందుకు అన్ని అంశాలపై శ్రద్ధ వహిస్తోంది.

ప్రశ్నమహారాష్ట్రలో కూటమి మనుగడపై?
గడ్కరీ
 : విరుద్ధమైన భావజాలమున్న పార్టీల కూటమి ఐదేళ్లు కొనసాగడం కష్టం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top