
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలు తీవ్రంగా నష్టపోతారని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని చెప్పారు. గతంలో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగినప్పటికీ... తాజా తీర్పుతో రిజర్వేషన్ల శాతం 50 శాతం మించకూడదని, దీంతో బీసీ రిజర్వేషన్లు 30 శాతం కూడా దాటవని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గిస్తున్నట్లు అఫిడవిట్ దాఖలు చేసిందని, దాని ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తే అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా స్థానిక సంస్థల్లోనూ బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ మేరకు కృష్ణయ్య ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.