ఆప్‌ కే సాథ్‌ !

AAP And BJP are fighting digital poll war - Sakshi

ఢిల్లీ గుండె చప్పుడు ఇదేనా?

కఠిన పరీక్ష ఎదుర్కొంటున్న కమలదళం

ఇన్నాళ్లూ మూడు స్తంభాలాట అన్నారు. ఇప్పుడు ముఖాముఖి పోరనే అంటున్నారు. రాజధాని రణ రంగంలో ఆప్, బీజేపీల మధ్యే ఎన్నికల యుద్ధం జరుగుతోంది. పోలింగ్‌కు ముందే కాంగ్రెస్‌ కాడె దింపేసింది.  బీజేపీ కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది.  జనం ఆప్‌ కే సాథ్‌ అంటున్నారని వివిధ పోల్‌ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాది క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 57శాతం ఓట్లతో ఏడుకి ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించింది. ఏడాదిలోనే బీజేపీకి ఏటికి ఎదురీడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?  

► ఢిల్లీలో నిరుపేదల సంఖ్య మిగిలిన హిందీ బెల్ట్‌ రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే. 2015–16 జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా దుర్భర దారిద్య్రంలో మగ్గిపోతున్నవారు 20శాతంగా ఉంటే, ఢిల్లీలో మాత్రం 0.2% మాత్రమే ఉన్నారు. దీని వల్ల ఉజ్వల యోజన పథకం కింద ఢిల్లీ జనాభాలో 2% మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలన్నీ నిరుపేదల్ని ఉద్దేశించినవి కావడంతో ఆప్‌ సర్కార్‌ వాటిని అమలు కూడా చేయడం లేదు.  

► ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతిని కూడా ఆకర్షించేలా తన సొంత సంక్షేమ ఎజెండాతో ముందుకు వెళుతూ ఎన్నో ఉచితాలు ప్రకటించింది. అందులో ఉచితంగా నెలకి 20 వేల లీటర్ల నీళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అత్యధికుల్ని ఆకర్షిస్తోంది.

► ఆప్‌ అవినీతి రహిత పరిపాలన అందిస్తోంది. సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ సుపరిపాలనే ఎజెండాగా తీసుకున్నారు. విపక్షాలు కొన్నాళ్లు ఆప్‌ సర్కార్‌లో అవినీతి జరుగుతోందని గగ్గోలు పెట్టినా దానికి ఆధారాలేమీ లేవు. ఎన్నికల ప్రచారంలో ఆ ఊసే లేదు.  

► అవినీతి లేని ప్రభుత్వాలు కావాలంటే ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా కేజ్రివాలే ఉత్తమమని ఓటర్లు ముందుగానే ఫిక్స్‌ అయినట్టుగా అనిపిస్తోందని ఎన్నికల విశ్లేషకుల అంచనా.  

► 2019 లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ గణనీయంగా ఓట్లు సాధించింది. 2017 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో చతికిలపడిపోయిన ఆప్‌ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంది. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370కి మద్దతునిచ్చింది. సీఏఏకి వ్యతిరేక ప్రదర్శనల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో సెక్యులర్‌ పార్టీ అంటే కాంగ్రెస్‌ అన్న అభిప్రాయం మైనార్టీల్లో వచ్చి ఆ పార్టీ వైపు వెళ్లారు. కానీ ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండడంతో ఆప్‌కే లబ్ధి చేకూరే అవకాశాలున్నాయని అంచనా.  

► ఢిల్లీ ఓటరు ఎన్నికల ఎన్నికలకీ తన తీర్పుల్ని తానే తిరగరాస్తూ ఉంటాడు. 2013 ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌కి సమానంగా స్థానాలిచ్చిన ఓటర్లు ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అక్కున చేర్చుకున్నారు. 2015లో ఆప్‌ వెంటే నడిస్తే, ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ ఆశలపై నీళ్లు చల్లారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. ఈ సారి ఆప్‌ వెంట నడుస్తారని సర్వేలు చెబుతున్నాయి.

– న్యూఢిల్లీ
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top