
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ పదవుల్లో బీసీలకు రెండు సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభకు ఇద్దరు బీసీలు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో మళ్లీ బీసీలకే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
యాదవ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ స్థానం కేటాయిస్తామన్న సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఇంకో స్థానాన్ని అత్యంత వెనకబడిన కులాలకు లేదా సం చార జాతుల్లో ఒకరికి కేటాయించాలని కోరారు. రైతు సమన్వయ సమితిల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ వర్గానికి చెందిన వారినే సమన్వయకర్తలుగా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బీసీలకు రైతు సమన్వయ సమితిలో, రాజ్యసభల్లో అవకాశం కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు.