ఫొటో పిచ్చి.. పరువు తీసుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే

2 BJP Leaders Wanted Their Photo At Blankets For Poor Event - Sakshi

సాక్షి, లక్నో : సాయం చేసేందుకు వెళ్లి వేరే విషయంపై ఫోకస్‌ చేసి ఇద్దరు బీజేపీ నేతలు పరువు తీసుకున్నారు. అది కూడా వారు చిన్నాచితక చోటామోటా నేతలు కాదు.. ఒకరు ఎంపీ కాగా మరొకరు ఎమ్మెల్యే. ప్రజాప్రతినిధులు ఇలాగేనా వ్యవహరించేదని, పైగా ఒక పార్టీ వారికి చెందిన వారే ఇలా చేస్తే మిగితా పార్టీల వారు ఏమనుకుంటారో తెలియదా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ రేఖావర్మ, మరో మహిళా ఎమ్మెల్యే తమ మద్దతుదారులతో కలిసి దుప్పట్లు పంపిణీ చేసేందుకు సీతాపూర్‌ జిల్లాకు వెళ్లారు. పెద్దపెద్ద అధికార ప్రతినిధులు హాజరవడంతోపాటు వారి మద్దతుదారులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు.

గత కొద్ది రోజులుగా విపరీతమైన చలికారణంగా పలువురు రోడ్డుపక్కన ఉండేవారు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వారికి దుప్పట్ల సాయం చేసేందుకు వెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లిన వారు దుప్పట్లు పంచే క్రమంలో ఫొటో విషయంలో పంచాయితీ పెట్టున్నారు. తానంటే తాను ముందు ఫొటో దిగాలంటూ గొడవకు దిగారు. అందరూ చూస్తున్నారనే సోయి మరిచిపోయి ఆగ్రహంతో ఊగిపోతూ ఒకరినొకరు తోసుకున్నారు. ఎంపీ రేఖా వర్మ ఓ వ్యక్తిపై చేయి చేసుకోగా మరో మహిళా ఎమ్మెల్యే తన చెప్పు తీసుకొని ఎంపీ మద్దతుదారుపై దాడి చేసింది. ఇలా ఆ కార్యక్రమం రచ్చరచ్చయింది. చివరకు అక్కడికి జిల్లా మేజిస్ట్రేట్‌, పోలీసు బాసు చేరుకొని గొడవ సదర్దుమణిగేలా చేశారు. అయితే, ఈ వీడియో మాత్రం బాగా హల్‌చల్‌ చేస్తోంది.

Back to Top