మృత్యురేఖలవుతున్న పట్టాలు

మృత్యురేఖలవుతున్న పట్టాలు


గత పదేళ్లకాలంలో ముంబై రైళ్లలోంచి 25,722 మంది ప్రయాణికులు కింద పడిపోగా వారిలో 6,989 మంది చనిపోయారు. 18,733 మంది బతికి బయటపడ్డారు. కాగా, ట్రాక్‌లకు అడ్డంగా ప్రయాణిస్తూ మరో 22,289 మంది తమ జీవితాలు కోల్పోయారు.ముంబైకి సంబంధించిన పలు విషయాలు సాధార ణంగా భారీ సంఖ్యలతో కూడి ఉంటాయి. నగర జనాభా 1.24 కోట్లు. దాదాపు సగం జనాభా మురికివాడల్లో ఉంటూ దుర్భర పరిస్థితుల్లో జీవిస్తుంటుంది. నగరపాలక సంస్థకు చెందిన రవాణా శాఖ దాదాపు 4 వేల బస్సులను నడుపుతుంటుంది. దాని ప్రతిష్టాత్మకమైన స్థానిక రైళ్లు ప్రతిరోజూ 70 లక్షలమంది ప్రయాణికులను తీసుకుపోతుంటాయి.వీటిలో దాదాపు 2,913 రైళ్లు తమ తమ ట్రాక్‌లపై రోజుకు 20 గంటలపాటు సాగిపోతుంటాయి. నగరం లోపలినుంచే కాకుండా శివార్ల నుంచి ప్రయాణించి వచ్చే వారిని కూడా  రెండు గంటలపాటు అటూ ఇటూ రవాణా చేస్తున్న రైల్వేలను ఈ అంశమే నగర ఆర్థిక కార్యాచరణలో కీలకంగా చేస్తోంది. ప్రయాణం మాత్రం అమానుషమైన పరిస్థితుల్లో సాగుతుంటుంది. పరిమితికి మించిన జనం రైళ్లలో ఏ స్థాయిలో కిక్కిరిసి ఉంటారంటే, రైల్వేలు దానికి కొత్త వ్యక్తీకరణను కూడా కనుగొనవలసి వచ్చింది. ఈ పరిస్థితిని ‘రద్దీవేళల్లో కిక్కిరిసిన జనం సూపర్ రాపిడి’ అంటూ రైల్వేలు పిలుస్తున్నాయి.కోచ్‌లలోకి ప్రవేశించే చోట, లోపలకి దూరడమో లేదా పడిపోవడమో తప్పదనిపించే స్థితిలో, కిందినుంచి రైల్లోకి ఎవరో ఒకరు తోసుకుని ప్రవేశించి మిమ్మల్ని అడ్డుకోకముందే మీరు రైల్లోంచి దిగాల్సి ఉంటుంది. రైలులోపల జనం పరస్పరం ఎంత దగ్గరగా కరుచుకుని ఉంటారంటే అది రోజువారీగా జరిగే నిర్బంధ ఉపద్రవాన్ని, పీడనను తలపిస్తుంది. రైల్లో సీటు దక్కించుకోవడం అంటే అది వరమే మరి. సీటు అంచులో కూర్చోవడానికి మీకు అవకాశం ఇస్తే మీ సహ ప్రయాణీకులకు కృతజ్ఞతలు చెప్పాల్సిందే. రైలు లోపల మీరు పొందగలిగేది అదే. కాని అది ఇతరుల దయ మాత్రమే.సగటున ప్రతి నాలుగు నిమిషాలకు ముంబై లోకల్ రైళ్లు నడుస్తుంటాయి. కాలానుగుణంగా వాటి పొడవు కూడా పెరుగుతూ వస్తోంది. మొదట్లో ఇవి 9 కోచ్‌లతో ఉండగా తరవాత వీటి సంఖ్య 12 కోచ్‌లకు పెరిగింది. ఇంకా ఎక్కువమందికి అవకాశం కల్పించడం కోసం కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం కోచ్‌ల సంఖ్య 15కు పెరిగింది. కానీ నేటికీ ప్రయాణికులకు ఉపశమనం లేదు. రైలు ప్రయాణం ఇప్పటికీ అభద్రతతోనే సాగుతోంది. కిక్కిరిసి ఉండటం చేత ప్రయాణికులు రైళ్ల నుంచి పడిపోతుంటారు. అంటే కొంతమంది తలుపు అంచుల వద్ద కడ్డీని పట్టుకుని మునిగాళ్లపై వేలాడుతూ ప్రయాణిస్తుంటారని దీనర్థం.గత పదేళ్లకాలంలో ముంబై రైళ్లలోంచి 25,722 మంది ప్రయాణికులు కింద పడిపోగా వారిలో 6,989 మంది చనిపోయారు. 18,733 మంది బతికి బయటపడ్డారు. కాగా, ట్రాక్‌లకు అడ్డంగా ప్రయాణిస్తూ మరో 22,289 మంది తమ జీవితాలు కోల్పోయారు. ఇక్కడ కేవలం రైల్వేనే నిందించడానికి లేదు. పాదచారులకోసం నిర్మించిన వంతెనలు చాలినంతగా లేవు. వీటిని సైతం రైల్వేలనే అంటిపెట్టుకుని ఉండే హ్యాకర్లు అడ్డుకుంటుంటారు. నిస్సందేహంగా అవసరం లేని సమయంలో పట్టాలు దాటేవారు తప్పు దారి పట్టినవారే అయి ఉంటారు.కొంతమంది తప్పుదారి పట్టిన కుర్రాళ్లు తమ సాహస ప్రవృత్తిని చాటుకునేందుకోసం రైలు తలుపుల వద్ద ఉన్న కడ్డీని పట్టుకుని వేలాడుతూ ఒకకాలిని ప్లాట్‌ఫాం మీద మోపి ప్రదర్శన చేస్తుంటారు. అయితే మృతుల  జాబితాలో వీరి సంఖ్య పెద్దగా లేదు కాబట్టి రైలు ప్రమాద మృతుల సంఖ్య పెరగటానికి సంబంధించి ఇలాంటివారిపై నింద మోపలేము. పని స్థలానికి వెళ్లడానికి లేదా ఇళ్లకు వెళ్లడానికి ఆత్రుతగా ఉండే ప్రయాణికులు రైలు కదులుతున్నప్పుడు కూడా ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే తర్వాతి రైలు కూడా తక్కువ రద్దీతో వస్తుందనడానికి లేదు.కాబట్టి రైల్వేలు తగిన నిర్వహణ వనరుల్లేక సతమతమవుతూ, ఆదివారం మరమ్మతుల కోసం కొన్ని సర్వీసులను మూసివేస్తున్నప్పటికీ, మెట్రోపాలిటన్ ప్రాంత జీవనరేఖగా పిలుస్తున్న స్థానిక రైళ్లలో భద్రత అనేది అత్యంత ఆవశ్యకమైనదిగా మారింది. కొత్తగా రూపొందించిన రైలుపెట్టెలు ఉండవలసిన దానికంటే ఎత్తుగా ఉండటంతో రైలు ఫ్లోర్‌కి, ప్లాట్‌ఫాంలకు మధ్య ఖాళీలు ఉంటూ కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్పుడు కీలకమైన వివరణలు ఎలా పక్కకు పోతున్నా యన్న దాన్ని ఇంకా స్పష్టం చేయడం లేదు. ఇలా  రైలు ఫ్లోర్‌కి, ప్లాట్‌ఫాంకు మధ్య ఖాళీలవల్ల ప్రయాణికులు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు జారిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు అడపాదడపా కాకుండా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరగవు, వాటిని మనుషులే చేస్తారు అనే వాదనకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. అలాగే ఫుట్‌బోర్డు మీద నిలిచి ప్రయాణించేవారు కదులుతున్న రైలు నుంచి  జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు లేదా తీవ్రంగా గాయపడుతున్నారు. కానీ పశ్చిమ లేదా మధ్య రైల్వే ఇలాంటి వాటిని తమ తప్పిదంగా అంగీకరిస్తున్నట్లు లేదు.రైల్వే తన నిర్వహణా తీరును మెరుగుపర్చుకో వాలని ముంబై హైకోర్టు పదే పదే సూచిస్తోంది. తాజాగా ఒక ఘటనపై కోర్టు వ్యాఖ్యానిస్తూ, రైల్వే వ్యవస్థలో ఒక్క ప్రాణ నష్టం జరిగినా అది ఆమోదనీయ గణాంకం కాదని తేల్చి చెప్పింది. ఫ్లాట్‌ఫాంల ఎత్తును పెంచాలని, రైల్వే కారణంగా గాయపడిన వారికి రైల్వే స్టేషన్లలో వైద్య సౌకర్యం అందించాలని, రవాణా ప్రమాద బాధితులను ఆసుపత్రులకు తీసుకె ళ్లడానికి అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ముంబై కోర్టే తరచుగా రైల్వే శాఖకు చెపాల్సివస్తోంది.

మొత్తంమీద చూస్తే, రైలు ప్రయాణికులకు రైల్వేలే ప్రయోజనం చేకూర్చాలని న్యాయస్థానాలు చెప్పాల్సి రావడమే ఒక విషాద గాథ.

 

- మహేశ్ విజాపూర్కార్

(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)

 ఈమెయిల్: mvijapurkar@gmail.com)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top