ఆదివాసుల ఆశలు అడియాశలేనా? | Telangan govt did not consider into Tribal people | Sakshi
Sakshi News home page

ఆదివాసుల ఆశలు అడియాశలేనా?

Sep 20 2016 1:24 AM | Updated on Aug 15 2018 9:35 PM

క్రొత్త జిల్లాలకు అవసరమైన ప్రభుత్వ యంత్రాంగం కేటాయింపుపై కేసీఆర్ ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ నాడు కొత్తగా 17 జిల్లాలను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించి, క్రొత్త జిల్లాలకు అవసరమైన ప్రభుత్వ యంత్రాంగం కేటాయింపుపై కేసీఆర్ ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు  చేస్తోంది. ‘‘పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం’’ పేరిట క్రొత్తగా 17 జిల్లాల ముసాయిదా ప్రకటన 22.8. 2016న విడుదల చేసింది. నెలరోజుల్లో ఆయా జిల్లాల ప్రజల అభిప్రాయాలు కోరింది. ప్రభుత్వం చెప్పుకుం టున్న ‘‘ప్రజల అభిప్రాయం’’, ప్రత్యేకంగా సమాజంలో నేటికీ అన్ని విధాలుగా వెనకబడి ఉన్న ఆది వాసుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోలేదు.
 
గతంలో ఒకటి, రెండు జిల్లాల ఏర్పాటుకు నిర్దేశించిన 1974 జిల్లాల పునర్విభజన చట్టం, దాని నియమ నిబంధనలు, ప్రస్తుతం పెద్దఎత్తున చేపట్టిన జిల్లాల పునర్విభజనకు సరిపోదు. ఆదివాసీ స్వయంపాలిత కౌన్సిల్ ఏర్పాటుకు బదులుగా, ఆదివాసీ ప్రాంతాలను చీల్చి, మరింతగా విచ్ఛిన్నం చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం పూనుకుంది.

ఆదివాసీల స్వయంపాలన హక్కును శాశ్వతంగా సమాధి చేసే విధంగా జిల్లాలను ఏర్పాటు చేయుట రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పైగా, కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలను విభజించి, 10, 12, 13 మండలాలతో చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసే సందర్భంలో కూడా ఆదివాసులకు ప్రత్యేకంగా జిల్లాలు ఏర్పరచే విషయాన్ని ఏ దశలో కూడా ఆలోచించలేదు.
 
  తెలంగాణ రాష్ట్రంలో 10 శాతంగా ఉన్న ఆదివాసులు.. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహ బూబ్‌నగర్ జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాలు ఈ 4 జిల్లాలలోనే వున్నాయి. పై నాలుగు జిల్లాల్లోనే కాక,  కరీంనగర్, నల్ల గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా గిరిజన గ్రామాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఆదివాసు లకు ప్రత్యేక జిల్లాలు, కనీసం ఒక్క జిల్లా కూడా ఏర్ప ర్చలేదు. షెడ్యూల్డు ప్రాంతాలను వివిధ జిల్లాల కింద విభ జించేశారు.
 ఖమ్మం జిల్లాలో భద్రాచలం కేంద్రంగా, ఆది లాబాద్ జిల్లాలో ఉట్నూరు కేంద్రంగా, వరంగల్ జిల్లాలో ములుగు లేక ఏటూరునాగారం కేంద్రంగా ప్రత్యేకంగా ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఆదివాసులు, వివిధ గిరిజన సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. కానీ వీరి డిమాండ్లను ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
 
 ఆదివాసులకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో, ఎన్నికల ప్రణాళికలో చేసిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయ లేదు. గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా, వీరిని పోడు భూముల నుండి దౌర్జన్యంగా గెంటివే యడం, పంటలు ధ్వంసం చేసి, తప్పుడు కేసులు బనా యించే కార్యక్రమం చేపట్టింది.

ఆదివాసుల ప్రత్యేక అస్తిత్వాన్నీ, సంస్కృతీ, సాంప్రదాయాలనూ వీరికిగల ప్రత్యేక చట్టాలు, రక్ష ణలు, హక్కులను దృష్టిలోకి తీసుకుని వీరు నివసిస్తున్న షెడ్యూల్డు ప్రాంతాలు, వీటితో కలసి ఉన్న గిరిజన ప్రాంతాలను ప్రత్యేక ఆదివాసీ జిల్లాలుగా ఏర్పాటు చేయాలి. ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలు, స్వయం పరి పాలనా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి.
- వ్యాసకర్త సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
 రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు  94907 00066
 - వేములపల్లి వెంకట్రామయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement