breaking news
tribal regions
-
ఆదివాసుల ఆశలు అడియాశలేనా?
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ నాడు కొత్తగా 17 జిల్లాలను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించి, క్రొత్త జిల్లాలకు అవసరమైన ప్రభుత్వ యంత్రాంగం కేటాయింపుపై కేసీఆర్ ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ‘‘పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం’’ పేరిట క్రొత్తగా 17 జిల్లాల ముసాయిదా ప్రకటన 22.8. 2016న విడుదల చేసింది. నెలరోజుల్లో ఆయా జిల్లాల ప్రజల అభిప్రాయాలు కోరింది. ప్రభుత్వం చెప్పుకుం టున్న ‘‘ప్రజల అభిప్రాయం’’, ప్రత్యేకంగా సమాజంలో నేటికీ అన్ని విధాలుగా వెనకబడి ఉన్న ఆది వాసుల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోలేదు. గతంలో ఒకటి, రెండు జిల్లాల ఏర్పాటుకు నిర్దేశించిన 1974 జిల్లాల పునర్విభజన చట్టం, దాని నియమ నిబంధనలు, ప్రస్తుతం పెద్దఎత్తున చేపట్టిన జిల్లాల పునర్విభజనకు సరిపోదు. ఆదివాసీ స్వయంపాలిత కౌన్సిల్ ఏర్పాటుకు బదులుగా, ఆదివాసీ ప్రాంతాలను చీల్చి, మరింతగా విచ్ఛిన్నం చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం పూనుకుంది. ఆదివాసీల స్వయంపాలన హక్కును శాశ్వతంగా సమాధి చేసే విధంగా జిల్లాలను ఏర్పాటు చేయుట రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. పైగా, కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలను విభజించి, 10, 12, 13 మండలాలతో చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసే సందర్భంలో కూడా ఆదివాసులకు ప్రత్యేకంగా జిల్లాలు ఏర్పరచే విషయాన్ని ఏ దశలో కూడా ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్రంలో 10 శాతంగా ఉన్న ఆదివాసులు.. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహ బూబ్‌నగర్ జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. షెడ్యూల్డు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాలు ఈ 4 జిల్లాలలోనే వున్నాయి. పై నాలుగు జిల్లాల్లోనే కాక, కరీంనగర్, నల్ల గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా గిరిజన గ్రామాలు ఉన్నాయి. అయినప్పటికీ, ఆదివాసు లకు ప్రత్యేక జిల్లాలు, కనీసం ఒక్క జిల్లా కూడా ఏర్ప ర్చలేదు. షెడ్యూల్డు ప్రాంతాలను వివిధ జిల్లాల కింద విభ జించేశారు. ఖమ్మం జిల్లాలో భద్రాచలం కేంద్రంగా, ఆది లాబాద్ జిల్లాలో ఉట్నూరు కేంద్రంగా, వరంగల్ జిల్లాలో ములుగు లేక ఏటూరునాగారం కేంద్రంగా ప్రత్యేకంగా ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా ఆదివాసులు, వివిధ గిరిజన సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. కానీ వీరి డిమాండ్లను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆదివాసులకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలంలో, ఎన్నికల ప్రణాళికలో చేసిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయ లేదు. గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా, వీరిని పోడు భూముల నుండి దౌర్జన్యంగా గెంటివే యడం, పంటలు ధ్వంసం చేసి, తప్పుడు కేసులు బనా యించే కార్యక్రమం చేపట్టింది. ఆదివాసుల ప్రత్యేక అస్తిత్వాన్నీ, సంస్కృతీ, సాంప్రదాయాలనూ వీరికిగల ప్రత్యేక చట్టాలు, రక్ష ణలు, హక్కులను దృష్టిలోకి తీసుకుని వీరు నివసిస్తున్న షెడ్యూల్డు ప్రాంతాలు, వీటితో కలసి ఉన్న గిరిజన ప్రాంతాలను ప్రత్యేక ఆదివాసీ జిల్లాలుగా ఏర్పాటు చేయాలి. ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలు, స్వయం పరి పాలనా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. - వ్యాసకర్త సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు 94907 00066 - వేములపల్లి వెంకట్రామయ్య -
కశ్మీరీలు, ఆదివాసీలు భారతీయులు కారా?
దేశంలో జరుగుతున్న అన్ని ప్రతిఘటనా పోరాటాలను మన డ్రాయింగ్ రూముల్లో, టీవీల ముందు కూర్చుని ఉగ్రవాదం అని పిలిచేస్తుంటాం. కశ్మీరీలను, ఆదివాసీలను, ఈశాన్య గిరిజనులను భారతీయులుగా పరిగణించడం లేదు. అక్కడ జరిగే హింస మనల్ని ఏమాత్రం స్పృశించడం లేదు. అందుకే ఆ హింసకు కారణాలను, వాటి పరిష్కారాలను మనం చాలా సులువుగా దాటేస్తుంటాం. దీనివల్ల్లే కేంద్ర ప్రభుత్వం ప్రతిఘటిస్తున్న వారిపట్ల తాను కోరుకుంటున్నంత కఠినంగా, నిర్దయగా వ్యవహరిస్తోంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న మూడు అతి పెద్ద ఘర్షణాత్మక ప్రాంతాలను భారత్ కలిగి ఉంటోంది. మొదటిది జమ్మూ కశ్మీర్. రెండు, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతో కూడిన మధ్యభారత ఆదివాసీ ప్రాంతం. మూడు, ఈశాన్య భారత్‌లోని గిరిజన ప్రాంతం. మొదటి ప్రాంతంలో సమస్య ఏమిటంటే, దేశ విభజన సమయంలో తమ వాణిని ఎవరూ పట్టించుకోలేదని కశ్మీర్ ముస్లి ములు భావిస్తున్నారు. ప్లెబిసైట్ (తామేం కోరుకుంటున్నారు అనే అంశంపై నిర్వహించే రిఫరెండం)పై నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తమకు చేసిన వాగ్దానం వెనుక్కు తీసుకున్నారని వీరి ఆరోపణ. పలు చర్యల పరంపర ద్వారా జమ్మూకశ్మీర్‌ను తర్వాత భారత సమాఖ్యలో కలిపేశారు, కాని వీటిని కశ్మీ రీలు చట్టబద్ధమైనవిగా ఆమోదించడం లేదు. ఐక్యరాజ్యసమితి మొదట్లోనే ఈ సమస్యలో తలదూర్చింది. కానీ, ప్రచ్ఛన్న యుద్ధం, చీలిపోయిన భద్రతా మండలి ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. అందుకే కశ్మీరీలు సరిగ్గా 3 దశాబ్దాల క్రితం హింసాత్మక తిరుగుబాటుకు సిద్ధపడ్డారు. బలమైన సైన్యం నీడలో రెండు తరాల కశ్మీరీలు ఎదిగారు. కశ్మీర్‌లోయలోని హిందువులు వలస వెళ్లిపోయారు. కానీ కశ్మీర్ వేర్పాటువాద హింస ఆ రాష్ట్రాన్ని దాటి వెళ్లలేదు. ఈ అన్ని దశాబ్దాలలోనూ ముంబై లేదా ఢిల్లీపై కశ్మీరీలు బాంబు పేలుళ్లకు, దాడులకు దిగలేదు. ఆయుధాలు చేపట్టిన కశ్మీరీలు వాటిని రాష్ట్ల్రంలోనే భారత సాయుధ బలగాలపైనే ఉపయోగించారు. తక్కిన భారత్ మొత్తంగా వీరిని ఉగ్రవాదులుగా చూస్తున్నప్పటికీ, కశ్మీరీలు మాత్రం వారిని అలా చూడలేదు. పాకిస్తాన్ నుంచి ప్రోత్సాహం లేనట్లయితే కశ్మీర్ ఒక సమస్యగా ఉండదని భారత్ భావన. అయితే కశ్మీరీలపై సాగుతున్న తీవ్ర హింసను చూస్తుంటే వారిని భారతీయులుగా మనం చూడలేదనిపిస్తోంది. ఇకపోతే, రెండో ఘర్షణాత్మక ప్రాంతంలో సాంప్రదాయిక ఆదివాసీ ప్రాంతా ల్లోని వనరులను కొల్లగొట్టడమే సమస్య. ఈ ప్రాంతంలో సమృద్ధిగా ఖనిజాలు, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఈ వనరులను జాతీయ సంపదగా భావించి వాటిని తోడేయాలని కోరుకుంటోంది. అయితే ఆదివాసీల భూములను కైవసం చేసుకుంటున్న మనం వారిపట్ల న్యాయంగా వ్యవహరించడం లేదు. భారత్ సమర్ధత ఉన్న ప్రాంతం కాదు. సంపన్న ప్రాంతమూ కాదు. భారత్‌లోని మెజారిటీ జనాభాకు, ప్రత్యేకించి పేదలకు ప్రభుత్వం విద్యను, ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో అందించలేదు. కానీ భారత జనాభాలో 8 శాతంగా ఉన్న ఆదివాసీల విషయానికి వస్తే మాత్రం వారు త్యాగం చేయాలని నొక్కి చెబుతుంటారు. నిజం చెప్పాలంటే ఆదివాసీ భూముల్లోంచి తోడివేసిన బొగ్గు ద్వారానే మన నగర ప్రాంతాల్లో ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషిన్లు పనిచేస్తున్నాయి. వారు నివ సిస్తున్న అడవులనే న రికి వాటిని కలుషితం చేస్తున్నాం. పైగా బొగ్గు గనులను దక్షిణ ముంబై, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో కనుగొన్నట్లుగా ఇక్కడి మానవహక్కులు, దోపిడీ, పర్యావరణం గురించి మరింతగా చర్చిస్తామని మనకు హామీ ఇస్తుం టారు కానీ, ఆదివాసీలు తమ హక్కుల కోసం జరిపే పోరాటంలో వారికి మద్ద తుగా నిలిచే మిత్రపక్షాలు ఏమంత ఎక్కువగా లేకపోవడం విచారకరం. దోపిడీకి వ్యతిరేకంగా సాగించే హింసాకాండను మనదేశంలో మావోయిజం లేదా వామపక్ష తీవ్రవాదం అని పిలుస్తున్నారు. ఇలా ముద్రవేయడం ద్వారా ఈ రకం హింసకు దారితీస్తున్న కారణాలను నగర భారతీయులు విస్మరించేలా చేసి మావోయిస్టులను ఉగ్రవాదులుగా ఆమోదించేయడం చాలా సులువైన పని. ఈ ఒక్క కారణం వల్లే తీవ్రవాది, ఉగ్రవాది, మావోయిస్టు, జిహాదిస్టు వంటి పదాలు మన నోళ్లలో అలవోకగా నానుతుంటాయి. కశ్మీర్ హింసలాగే మావోయిస్టు హింస కూడా చెన్నయ్ లేదా కోల్‌కతాకు చేరడం లేదు. ఈ హింస ఆదివాసీ ప్రాంతానికే పరిమితం అయింది. మన నగరాల్లో మందుపాతరలు పేలవు. కార్పొరేట్ ఆఫీసు లను ఎవరూ ముట్టడించరు. ఇక మూడో ఘర్షణాత్మక ప్రాంతం ఈశాన్య భారత్. ఇది మొఘల్ పాలన కిందికి రాని భారత్‌లోని భాగం. బ్రిటిష్ పాలకులు వీరిని లోబర్చుకున్నారు. ఈ ప్రాంతాన్ని ఇటీవలి కాలంలోనే భారత్‌లో కలిపేశారు. ఈ ప్రాంతంలోని కొన్ని ఆదివాసీ తెగలు 1947కి చాలాకాలం క్రితమే తమను ఇండియాలో కలిపేయడాన్ని ప్రతిఘటించాయి. వీరు తర్వాత కూడా తమ హింసను కొనసాగించారు. బలంగా పాతుకుపోయిన భారత సైన్యం ఇక్కడి ప్రతిఘటనను చల్లబర్చింది. కానీ ఈశాన్య భారత్‌లోని తిరుగుబాటుదారులు కూడా తమ పోరాటాన్ని బెంగళూరు, లేదా హైదరాబాద్‌లో చేయడం లేదు. మన విమానాశ్రయాలపై ఎలాంటి దాడులూ జరగటం లేదు, మన పాఠశాలల్లో ఎవరినీ బందీలుగా పట్టుకోవడం లేదు. లక్షలాది కశ్మీరీలు, ఈశాన్య భారతీయులు తాము పనిచేస్తున్న భారత్‌లోని నగర కేంద్రాల్లోనే నివసిస్తున్నారు. వీరికి ఇళ్లను అద్దెకు ఇవ్వడానికి తిరస్కరించి నప్పుడు, తమ జాతి కారణంగా వీరిపై దాడులు జరిగినప్పుడు నిత్యం వార్తల్లోకి వస్తుంటారు. తమ సొంత గడ్డపై జరుగుతున్న ఘర్షణను వారు అక్కడే వదిలే శారు. అయినా మరొక దేశంలో నివసిస్తున్నవారికి లాగా.. వీరిపై దాడులు చేస్తు న్నారు, చంపుతున్నారు. మనదేశ మూడు ప్రధాన ఘర్షణాత్మక ప్రాంతాలను భార తీయ మధ్యతరగతి విస్మరించడానికి ఈ కీలక వాస్తవమే కారణం. అక్కడ జరిగే హింస మనల్ని ఏమాత్రం స్పర్శించడం లేదు. అందుకే ఆహింసకు కారణాలను, వాటి పరిష్కారా లను మనం చాలా సులువుగా దాటేస్తుంటాం. మన డ్రాయింగ్ రూముల నుంచి, టీవీల నుంచి దీన్ని మనం ఉగ్రవాదం అని పిలుస్తుంటాం. ఉగ్రవాదానికి దూరంగా ఉంటాం. అలా ఉండగలిగేందుకు తగిన అదృష్టవంతులం మరి. ఈ పరిస్థితి వల్లే ప్రభుత్వం ప్రతిఘటిస్తున్న వారి పట్ల తను కోరుకుంటున్నంత స్థిరంగా, కఠినంగా వ్యవహరి స్తోంది. కారణం ఒకటే. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు మనపై నేరుగా ప్రభావం చూపడం లేదు. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com - ఆకార్ పటేల్