డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!

TANA And TANTEX Conducted A Programme With Jonnavithula Ramalingeswara Rao In Dallas - Sakshi

తానా, టాంటెక్స్‌ ఆధ్వర్యంలో చమత్కార చతుర్ముఖ పారాయణం

ముఖ్య అతిథిగా విచ్చేసిన జొన్నవిత్తుల

ఆద్యంతం ఆకట్టుకున్న జొన్నవిత్తుల  పాటలు ,పేరడీలు

డల్లాస్ (టెక్సస్‌) :  ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'ఆహా! ఈహీ! ఒహో!' అనే తెలుగు సాహితీ వైభవ కార్యక్రమాన్ని జూలై 21న డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు దాదాపు 200 మందికి పైగా సాహితీ ప్రియులు హాజరయ్యారు. నాలుగు గంటల పాటు సభను ఉత్సాహంగా నిర్వహించి విజయవంతం చేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  ప్రముఖ సినీ గేయ రచయిత, తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి తానాబోర్డు కార్యదర్శి మురళి వెన్నం సాదర స్వాగతం పలికారు. కొత్తగా ఎన్నికైన తానా సభ్యులను సభకు పరిచయం చేస్తూ, భావసారుప్యం ఉన్నజాతీయ, స్థానిక సంస్థలతో కలసి తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకై మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగాటాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు మట్లాడుతూ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగాఉందని, తానాకి కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులందరకి అభినందనలు తెలియజేశారు. 'సాహితీ వేముల', 'సింధూర వేములలు','మా తెలుగు తల్లికి మల్లె పూదండ', 'ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట' అనే గీతాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తానా మరియు టాంటెక్స్ సంస్థల పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారినిసభకు పరిచేయం చేస్తూ..  శ్రీ శ్రీ, దాశరథి, వేటూరి, పురాణం సుభ్రమణ్యం శర్మ, డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి  లబ్ధ ప్రతిష్టులతో ఎంతో ఆత్మీయంగా మెలిగిన శ్రీ జొన్నవిత్తులగారు ఇక్కడికి రావడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. తానాకార్యవర్గ సభ్యుడు లోకేష్ నాయుడు జొన్నవిత్తుల గారిని పుష్పగుచ్చంతో వేదికపైకి ఆహ్వానం పలికినప్పుడు కరతాళధ్వనులు మిన్నంటాయి.

నాలుగు భాగాలుగా చతుర్ముక పారాయణం
మహాత్మా మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. శ్రీ జొన్నవిత్తుల గారితో వినూత్నంగా మొదటిసారి చమత్కార చతుర్ముఖ పారాయణం అనేనాలుగు ప్రక్రియలున్న సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ చతుర్ముఖ పారాయణంలో సినీ సాహిత్యం, తెలుగు భాషా వైభవం,పురాణాల ప్రాశస్త్యం, పేరడీ పాటలు అనే నాలుగు విభాగాలుగా విభజించి ఒక కొత్త తరహ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా  జొన్నవిత్తుల మాట్లాడుతూ.. డా. ప్రసాద్ తోటకూర గారితో తనకున్న ఎన్నో సంవత్సరాలు అనుబంధాన్ని గుర్తు చేశారు.  తెలుగు భాషా ప్రియత్వం, నాయకత్వ లక్షణాలపై ప్రసాద్‌గారి ప్రేమను కొనియాగారు. ఇది తన 17వ అమెరికా పర్యటన అని తానా, టాంటెక్స్ లాంటి అనేక తెలుగు సంస్థలు తనకిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదన్నారు.

జొన్నవిత్తుల గారితో ప్రసాద్ తోటకూర ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలో కవి జొన్నవిత్తుల తాను రాసిన పాటలు అనేక సినిమాలలో వినూత్న ప్రయోగాలుగా ఉండి అత్యంత ప్రజాదరణ పొందాయని పేర్కొన్నారు. ఒక డిస్కో పాటని పూర్తిగా సంస్కృతంలో రాయడం, కేవలం 'సరిగమపదని' అనే సప్త అక్షరాలతో పాట రాయడం, 'చినుకు చినుకు అందెలతో', 'జగదానంద కారకా', 'ఓ వాలు జడా, పూలజడా' వంటి పాటల నేపధ్యం గురించి అడిగినప్పుడు, అదంతా దర్శక, నిర్మాతలు తనికిచ్చిన అవకాశం అని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా జొన్నవిత్తుల గారు డా. మంగళంపల్లి బాలమురళి, బాపు, రమణ, వేటూరి గార్లతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాంటి గొప్ప పండితులతో, మేధావులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రావడం తన పూర్వజన్మసుకృతం అని తెలిపారు. తర్వాత కనక దుర్గమ్మవారి రూపంలోని అక్షరమాలను, అక్షరమాలలో ఉన్న సకల సంగీత వాయిద్య పరికరాలను దర్శిస్తూ తెలుగు భాషా వైభవాన్ని జొన్నవిత్తుల పాడి వినిపించడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. కోనసీమ శతకం, బతుకమ్మ శతకం, సింగరేణి శతకం, రామలింగేశ్వర శతకాల్లో నుoచి ఎన్నో పద్యాలను పాడి సభికులను ఆనందపరవశంలో ముంచెత్తారు.

అదే విధంగా ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో రాజకీయ పార్టీల గందరగోళం, యధేచ్చగా పార్టీలు మారడం, ఎన్నికల వాగ్ధానాలు, మద్యపానం, అవినీతి, స్కీములు, స్కాములు లాంటి అంశాలను కథా వస్తువుల ఆధారంగా శ్రీ జొన్నవిత్తుల పేరడీలు సృష్టించడంతో సభలో మొత్తం కేరింతలు, ఈలలతో నిండిపోయింది.

ఈ సందర్భంగా శ్రీ జొన్నవిత్తుల గారిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ బృందం శాలువా, జ్ణాపికను బహుకరించి "అభినవ చమత్కార కవిసార్వభౌమ" అనే బిరుదుతో సత్కరించారు. సభకు విచ్చేసిన జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులు డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారు శ్రీ జొన్నవిత్తులగారిని, వారి కవితా చాతుర్యాన్ని కొనియాడారు. డా. జంధ్యాల భాస్కర శాస్త్రి గారిని సభ నిర్వాహకులు గౌరవపూర్వకంగా శాలువాతో సత్కరించారు.కార్యక్రమం చివర్లో తానా పూర్వాధ్యక్షులైన డా. నవనీత కృష్ణ గొర్రెపాటి, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట, డా. ప్రసాద్ తోటకూరలను తానా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తానా జాతీయస్థాయిలో తెలుగు వారందరికి మాతృ సంస్థ అని, గతంలో తానా, టాంటెక్స్ కలసి  ఇక ముందు కూడా కలిసి పని చేస్తూ, పరస్పర సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు.

గాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించిన జొన్నవిత్తుల

ఈ సాహితీ సమావేశం తర్వాత డా. ప్రసాద్ తోటకూరతో కలసి జొన్నవిత్తుల అమెరికాలోనే అతి పెద్దదైన 18 ఎకరాల పార్క్ లో నెలకొల్పిన మహాత్మాగాంధీ స్మారక ప్రాంతాన్ని సందర్శించి  పుష్పాంజలి ఘటించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఒక మధురానుభూతి అని, ఈ స్మారక నిర్మాణం వెనుక  డా. తోటకూర ప్రసాద్ గారి కృషి, పట్టుదల, అకుంటిత దీక్షను  కొనియాడదగినదని జొన్నవిత్తుల పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గ బృందం డా. అడుసుమిల్లి రాజేష్, చలపతి కొండ్రకుంట, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, సతీష్ కొమ్మన, రాజ నల్లూరి, రవి అల్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, పరమేష్ దేవినేని, శేషారావు బొడ్డు, శివ రావూరి, లోకేష్ నాయుడు కొణిదాల, సుబ్బరావు కారసాల, శ్రీని మండువ, అనిల్ ఆరేపల్లి, రావు కల్వల, డా. సి.ఆర్.రావు, డా. విశ్వనాధం పులిగండ్ల, ఎం.వి.యల్.ప్రసాద్, టాంటెక్స్ పూర్వధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, విజయ్ కాకర్ల, రాజా రెడ్డి, గీతా దమ్మన్న, ఆర్.కె పండిటి, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ తోపుదుర్తి, శ్రీకాంత్ జొన్నల, టాటా అధ్యక్షులు విక్రం జంగం, నాటా ఉత్తరాధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, ఆటా బోర్డు అఫ్ డైరెక్టర్ సతీష్ రెడ్డి తో సహా ఎంతో మంది పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top