అక్రమ నివాసులకు వరం

Amnesty in Malaysia - Sakshi

మలేషియాలో ఆమ్నెస్టీ 

డిసెంబరు 31 వరకు గడువు  

అవగాహన కల్పిస్తున్న ‘మైటా’

(వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల) :ఉపాధి కోసం మలేషియా వెళ్లి.. వివిధ కారణాలతో అక్కడే చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారికి ఆ దేశం గత నెలలో క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ప్రకటించింది. మలేషియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ జిల్లాలకు చెందినవలస జీవులకు ఊరట లభించింది. ఇబ్బందులు పడుతున్న వారంతా చట్టబద్ధంగా స్వస్థలాలకు చేరుకోవచ్చు. ఆమ్నెస్టీ గడువు డిసెంబరు 31 వరకు ఉంది. ఆమ్నెస్టీద్వారా స్వదేశాలకు వెళ్లే వారు మలేషియా రింగిట్స్‌ 700 (ఇండియన్‌ కరెన్సీలో రూ.12వేలు) చెల్లించాల్సి ఉంటుంది. విమాన టిక్కెట్లు స్వతహాగానే సమకూర్చుకోవాలి. మలేషియాలో తెలంగాణ జిల్లాలకు చెందిన వారు 20వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. అక్కడి ఫామాయిల్‌ తోటల్లో అనేక మంది పనిచేస్తున్నారు.నైపుణ్యం కలిగిన వారికి మెరుగైన జీతాలు ఉండగా.. అన్‌స్కిల్డ్‌ లేబర్‌కు 800 నుంచి 1200 రింగిట్స్‌ చెల్లిస్తారు. అయితే,  ఎక్కువ జీతాల ఆశతో కంపెనీని వీడి బయటపనిచేస్తూ సుమారు 2వేల మంది అక్రమ నివాసులుగా మారినట్లు అంచనా. ఇందులో కొందరు జైలుశిక్ష అనుభవిస్తున్నారు. వారంతా మలేషియా ప్రభుత్వంప్రకటించిన ఆమ్నెస్టీతో స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఏర్పడింది.

వలస జీవులను ఆదుకుంటాం..
మలేషియాలోని జైళ్లలో మగ్గుతున్న వారిని, బయట చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని మలేషియా తెలంగాణ అసోసియేషన్‌(మైటా) ద్వారా ఆదుకుంటాం. డిసెంబరు 31 వరకు ఆమ్నెస్టీ అమల్లో ఉంటుంది. దీనిని వినియోగించుకుంటే ఇబ్బందులు ఉండవు. మా సంస్థ ద్వారా తెలంగాణ ప్రాంత కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం.    – తిరుపతి సైదం, మైటా అధ్యక్షుడు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top