రెండ్రోజుల్లో పింఛన్లు

cash problem clear for aasara pensions - Sakshi

‘ఆసరా’కు తీరిన నగదు కొరత

ఉమ్మడి జిల్లాకు చేరిన రూ.20 కోట్లు

పంపిణీకి తపాలా శాఖ ఏర్పాట్లు

జిల్లాలో 85వేల మంది లబ్ధిదారుల ఎదురుచూపులు

మోర్తాడ్‌(బాల్కొండ): నగదు కొరతతో పింఛన్లు తీసుకోలేని ఆసరా లబ్ధిదారులకు ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాకు రూ.20 కోట్ల నగదును ఆర్‌బీఐ విడుదల చేయడంతో నిలిచిన పింఛన్లను పంపిణీ చేసేందుకు తపాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెర్ప్‌ ఉన్నతాధికారుల షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 2వ తేదీనే గడువు ముగియగా, బ్యాంకుల నుంచి సరిపడా నగదు సరఫరా కాకపోవడంతో పింఛన్ల పంపిణీలో ఆటంకాలు తలెత్తాయి. గడచిన డిసెంబర్‌కు సంబంధించి పింఛన్ల పంపిణీని అదే నెలలో 22న మొదలుపెట్టారు. వారం రోజుల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, నగదు కొరతతో జాప్యం ఏర్పడింది. దీంతో జిల్లాలో పలుచోట్ల ఆసరా పింఛన్ల కోసం లబ్ధిదారులు ఆందోళనలు చేశారు.  

జిల్లా మొత్తంలో 2,61,976 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో కొంతమందికి రెండు, మూడునెలలకు సంబంధించిన ఫించన్‌లను అందించాల్సి ఉంది. ఈసారి జిల్లాకు రూ.40 కోట్ల నగదు అవసరం కాగా ఇప్పటి వరకు రూ.24 కోట్లు సరఫరా అయ్యింది. ఇంకా రూ.16 కోట్ల నగదు అవసరం ఉంది. ఇప్పటి వరకు పింఛన్‌లు తీసుకోని లబ్ధిదారుల సంఖ్య 85వేల వరకు నమోదైంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా పింఛన్లు పూర్తిస్థాయిలో పంపిణీ కాలేదు. గడచిన నెల 22న ఆరంభమైన పింఛన్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో ఆసరా లబ్ధిదారులను నిరుత్సాహపర్చ వద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎలాగైనా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చింది.

రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ ఆర్‌బీఐ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడటంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఆసరా పింఛన్ల కోసం నగదు కొరత తీర్చడానికి చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి రూ.20 కోట్ల నగదును కేటాయించారు. ఇందులో కామారెడ్డి జిల్లాకు రూ.8 కోట్లు, నిజామాబాద్‌ జిల్లాకు రూ.12 కోట్లను సర్దుబాటు చేశారు. రెండు జిల్లాలకు ఈ రోజు నగదు సరఫరా కాగా తపాల సిబ్బందికి చేరే సరికి సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. పింఛన్‌ల పంపిణీ కోసం మరో రెండురోజుల గడువు పొడిగించాలని సెర్ప్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.  

గడువు కోరాం..
ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించిన నగదు ఈ రోజు సరఫరా అయ్యింది. అయితే పింఛన్‌ల పంపిణీకి సమయం సరిపోదు. అందువల్ల మరో రెండురోజుల పాటు గడువును కోరాం. నగదు కేటాయించిన దృష్ట్యా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం కూడా గడువు పెంచే అవకాశం ఉంది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.   – రవీందర్, ఏపీఎం, డీఆర్‌డీఏ

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top