
కోల్‌కతా : ఓ ప్యాసింజర్ చేసిన ఆకతాయి పని వల్ల రన్ వేపై ఉన్న విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు ఎయిర్‌పోర్టు అధికారులు. ఈ ఘటన సోమవారం కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాలు.... కోల్‌కతా నుంచి ముంబై వెళ్లేందుకు యోగివేదాంత్ పోద్దార్ అనే యువకుడు జెట్ ఎయిర్‌వేస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం 9w-472 నంబరు గల విమానం ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన ఫోన్ తీసి.. ‘విమానంలో టెర్రరిస్టు ఉన్నాడు. అమ్మాయిల హృదయాల్ని కొల్లగొడతా’ అంటూ స్నేహితులకు మెసేజ్ చేయడంతో పాటు....కర్చీఫ్‌ను ముఖానికి కట్టుకుని ఫొటో దిగాడు. ఇదంతా గమనించిన మరో ప్యాసింజర్ భయంతో సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు యోగివేదాంత్‌ను విచారించారు.
ఈ క్రమంలో కేవలం తాను సరదా కోసమే ఇలా చేశానని, దీనిపై ఇంత రాద్దాంతం జరుగుతుందని ఊహించలేదని అతడు పేర్కొన్నాడు. దీంతో అతడి గురించి పూర్తి వివరాలు సేకరించిన అనంతరం అధికారులు యోగిని విడిచిపెట్టారు. అదే విమానంలో అతడిని ముంబైకి పంపించారు. కాగా యోగి చేసిన ఆకతాయి పని వల్ల విమానాన్ని అత్యవసరంగా నిలిపివేయాల్సి వచ్చిందని ఎయిర్‌పోర్టు అధికారి తెలిపారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఏ విషయాన్ని తేలికగా తీసుకోలేమని, ఈ కారణంగానే విమానం గంట ఆలస్యంగా బయల్దేరిందని పేర్కొన్నారు.