
సాక్షి, భరూచ్: ఇంటి నుంచి బయటకు వెళ్తే ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేం. వాహనాలు మాత్రమే కాదు జంతువు కూడా ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశాలున్నాయి. గుజరాత్‌లో అలాంటి ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షాకింగ్ వీడియో చూస్తే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.
స్థానిక భరూచ్ ప్రాంతంలో ఓ మహిళ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతోంది. పసుపు రంగు చీర ధరించిన ఆ మహిళ చాలా జాగ్రత్తగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ఎద్దు రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ ఎద్దు కొమ్ములతో మహిళపై దాడి చేసింది. కొమ్ములతో గట్టిగా మహిళను గాల్లోకి లేపి విసిరికొట్టింది. దీంతో గాల్లోకి దాదాపు పది అడుగుల ఎత్తుకు ఎగిరిన మహిళ.. పల్టీలు కొడుతూ కింద పడిపోయారు. ఇది గమనించిన కొందరు వ్యక్తులు ఏం జరిగిందోనని బాధితురాలి వద్దకు పరుగులు తీయడం దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.