వితంతువులు పింఛన్లు పొందే నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. కొన్ని ప్రత్యేక కేసుల్లో కుటుంబ పింఛను పొందేందుకు వితంతువులు ఇద్దరు గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ పొందాల్సిన అవసరం లేకుండా చేసింది.
న్యూఢిల్లీ: వితంతువులు పింఛన్లు పొందే నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. కొన్ని ప్రత్యేక కేసుల్లో కుటుంబ పింఛను పొందేందుకు వితంతువులు ఇద్దరు గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ పొందాల్సిన అవసరం లేకుండా చేసింది. కుటుంబ పింఛను కోసం ‘ఫామ్ 14’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన వితంతువులకు ఇబ్బందికరంగా మారిందంటూ వివిధ వర్గాల నుంచి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పింఛన్ల శాఖకు వినతిపత్రాలందాయి.
వీటిని పరిశీలించిన ప్రభుత్వం పింఛనుదారుకు, భర్త/భార్యకు జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే ఇతర వ్యక్తులెవరో కుటుంబ పింఛను కోసం దరఖాస్తు చేసుకోవడమనే సమస్యే ఉత్పన్నం కాదనే అంశంతో ఏకీభవించింది. అందువల్ల ఇలాంటి కేసుల్లో ‘ఫామ్ 14’ అవసరం ఉండదు. పింఛనుదారు మరణాన్ని భర్త/భార్య బ్యాంకు అధికారులకు తెలియజేయడం ద్వారా ఓ చిన్న లేఖతో తనకు కుటుంబ పింఛను మంజూరు చేయవలసిందిగా కోరవచ్చని ప్రభుత్వం తెలిపింది.