
యోగిని మోదీ ఎందుకు సీఎం చేశారు?
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఎంత ఆసక్తిగా సాగాయో అంతకంటే ఆశ్చర్యంగా ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా అనూహ్య వ్యక్తి బాధ్యతలు చేపట్టారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఎంత ఆసక్తిగా సాగాయో అంతకంటే ఆశ్చర్యంగా ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా అనూహ్య వ్యక్తి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే ఈ విషయంపై దేశ వ్యాప్తంగా ఓ భారీ చర్చనే జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం విదేశీ మీడియా ఉత్తరప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ గురించి ఏం చర్చిస్తుందో పరిశీలిస్తే కాస్తంత ఆశ్చర్యపోక మానదు. సన్యాసిగా ఉంటూ అతి తక్కువ వయసులోనే ఎంపీగా బాధ్యతలు చేపట్టిన యోగి ముందునుంచే గట్టి హిందూత్వవాదిగా పేరొందారని పేర్కొంది.
అలాంటి వ్యక్తికి దేశంలోనే అతి పెద్దదైన రాష్ట్రం యూపీ బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా 2019 ఎన్నికల్లో తాను ఎంచుకోబోయే ఎజెండాను కుండబద్ధలు కొట్టారని కూడా విదేశీ మీడియా చెబుతోంది. హిందూత్వ ఎజెండాతోనే తాను ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు మోదీ చెప్పారని మీడియా పేర్కొంది. యోగి ఆదిత్యనాథ్‌కు అతివాద హిందూ భావజాలం ఎక్కువని, వివాదాలకు పేరొందినవారని, ఆయనపై ఇప్పటికే బోలెడు కేసులు ఉన్నాయని, ఒక హత్యారోపణ కేసు కూడా పెండింగ్‌లోనే ఉందని, ఆయనకు ముస్లింలంటే ఆగ్రహం అని ఇలా రకరకాలు తెలిపింది.
అంతేకాకుండా ఏడు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించినప్పుడు దానిని ఆదిత్య సమర్థించారని, భారత దేశంలో కూడా అలాంటి సంస్కరణలు తీసుకురావాలని చెప్పారని, అలాంటి వ్యక్తికి మోదీ పగ్గాలు ఇవ్వడం కాస్తంత ఆశ్చర్యం కలిగించిందని కూడా మీడియా వెల్లడించింది. ఆదిత్యనాథ్‌కు బాధ్యతలు అప్పగించడం ద్వారా మోదీ మరోసారి హిందూత్వ ఎజెండాను కచ్చితంగా అమలుచేయాలనే సుదీర్ఘ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందని విదేశీ మీడియా రాసుకొచ్చింది.