
నీరు ఉమ్మడి సంపద: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
నీరు ప్రజల ఉమ్మడి వారసత్వ సంపదనే స్పృహ కలిగించేలా చట్టాలుండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: నీరు ప్రజల ఉమ్మడి వారసత్వ సంపదనే స్పృహ కలిగించేలా చట్టాలుండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఆయన శక్రవారమిక్కడ నాలుగవ ‘భారత్ జలవారోత్సవం’ ముగింపు ఉత్సవంలో ప్రసంగించారు. చాలా సామాజిక వర్గాలకు ఇప్పటికీ నీరు అందుబాటులో లేదని ఆవేదన చెందారు. స్థానిక పరిష్కారాలతోనే ఈ సమస్యను అధిగమించొచ్చని సూచించారు. ‘ఆదాయ సంపాదన కన్నా నీటి సేకరణకు ప్రజలు అధిక సమయం, శక్తులను వెచ్చిస్తున్నారు.
స్థానికంగా అమలయ్యే సాంకేతికత, వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టాలి’అని చెప్పారు. నీటి సంరక్షణకు వాననీటిని ఒడిసిపట్టాలని , ఈ పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అనుసంధానించాలన్నారు. కాగా, నిర్మాణంలో ఉన్న 31 ప్రాజెక్టులు, నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తయితే 35 మిలియన్ హెక్టార్లకు సాగునీరు ఇవ్వడంతో పాటు 34 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని జలవనరుల మంత్రి ఉమాభారతి చెప్పారు.