నన్ను చంపేందుకు కుట్ర | Sakshi
Sakshi News home page

నన్ను చంపేందుకు కుట్ర

Published Wed, Jan 17 2018 3:55 AM

VHP leader Pravin Togadia found in hospital, hours after 'missing' reports - Sakshi

అహ్మదాబాద్‌: ఎన్‌కౌంటర్‌లో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్‌ తొగాడియా(62) సంచలన ఆరోపణలు చేశారు. రాజస్థాన్, గుజరాత్‌ పోలీసులు తనను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.  హిందూ జాతి, రామజన్మభూమి, గోవధ, రైతుల గురించి మాట్లాడకుండా చేసేందుకు, తన గొంతునొక్కేందుకు పదేళ్ల నాటి కేసులో అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయించారని ఆరోపించారు. తరచూ ముస్లిం వ్యతిరేక, హిందూ అనుకూల ప్రకటనలతో వార్తల్లో నిలిచే తొగాడియాకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో దగ్గరి సంబంధాలున్నాయి.

అలాంటి తొగాడియా బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఇలాంటి ఆరోపణలు చేయటం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మంగళవారం అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సోమవారం ఉదయం గుజరాత్, రాజస్థాన్‌ పోలీసులు కలిసి పెద్ద సంఖ్యలో నా ఇంటికి వస్తున్నారని, ఎన్‌కౌంటర్‌లో చంపేందుకు కుట్ర పన్నారని సమాచారం అందింది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరరాజే, హోంమంత్రి గులాబ్‌చంద్‌ కటారియాలను ఫోన్‌లో సంప్రదించగా అరెస్ట్‌ వారెంట్‌ విషయం తమకు తెలియదన్నారు.

కోర్టు ఉత్తర్వులు అయినందున తాము ఆపలేమంటూ రాజస్థాన్‌లోని నా లాయర్లు కూడా చెప్పారు. దీంతో పోలీసులు చంపేస్తారనే భయంతో సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేసుకున్నా. విమానంలో జైపూర్‌ వెళ్లి అక్కడి నుంచి గంగాపూర్‌ కోర్టులో హాజరుకావాలనుకుని మరో వ్యక్తితో కలిసి ఆటోలో బయలుదేరా. తట్లేజ్‌ ప్రాంతంలోకి వెళ్లేసరికి బ్లడ్‌ షుగర్స్‌ లెవల్స్‌ పడిపోవటంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాను. తిరిగి చేసేసరికి ఆస్పత్రిలో ఉన్నాను.

ఈ నెల మొదటి వారంలో అహ్మదాబాద్‌లో కూడా తనపై అరెస్ట్‌ వారెంట్లు జారీ కాగా, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, హోంమంత్రి ప్రదీప్‌ సిన్హ్‌ జడేజాను అడగ్గా తమకు ఆ విషయం తెలియదన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారో నాకు తెలుసు. నా హత్యకు కుట్ర పన్నిన వారి పేర్లను సరైన సమయంలో సాక్ష్యాలతో సహా వెల్లడిస్తా ’అని తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వీహెచ్‌పీ వర్గాలు తెలిపాయి. గుజరాత్‌ పటీదార్‌ ఉద్యమ నేత హార్ధిక్‌పటేల్, రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అర్జున్‌ మొధ్వాడియా తొగాడియాను ఆస్పత్రిలో పరామర్శించారు.

Advertisement
Advertisement