గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత

Veteran playwright-actor Girish Karnad passes away - Sakshi

దీర్ఘకాలంగా బాధించిన అనారోగ్యం

నిరాడంబరంగా అంత్యక్రియలు

రాష్ట్రపతి, ప్రధాని, ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంల సంతాపం

సాక్షి, బెంగళూరు: ఐదు దశాబ్దాల పాటు నాటక, సినీ, సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన బహుభాషా నటుడు, ప్రఖ్యాత నాటక రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత గిరీష్‌ కర్నాడ్‌ (81) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం బెంగళూరులో లావెల్లీ రోడ్డులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సరస్వతి, జర్నలిస్టు, రచయిత అయిన కొడుకు రఘు కర్నాడ్, కుమార్తె రాధ ఉన్నారు. తన తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని రఘు తెలిపారు. ఆయన ఉదయం వేళలో మరణించారని, 8.30 సమయంలో ఆయన చనిపోయినట్టుగా తాము గుర్తించామని చెప్పారు.

కాగా ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం గిరీష్‌ కర్నాడ్‌ భౌతికకాయాన్ని బయ్యప్పనహళ్లి రోడ్డులోని కల్లహళ్లిలో ఉండే విద్యుత్‌ శ్మశాన వాటికలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించినా.. కర్నాడ్‌ కోరిక మేరకు, ఆయన కుటుంబసభ్యుల విజ్ఞప్తితో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు లేకుండా నిరాడంబరంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా కర్నాడ్‌ మృతికి సంతాప సూచకంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. మరో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. గిరీశ్‌ కర్నాడ్‌ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు, నటులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, హెచ్‌డీ కుమారస్వామి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక మంత్రులు డీకే శివకుమార్, ఆర్‌వీ దేశ్‌పాండే, బి.జయశ్రీ, సురేష్‌ హెబ్లీకార్‌ తదితర నాటక, సినీరంగ ప్రముఖులు తమ అంతిమ నివాళులర్పించారు. అంత్యక్రియలను తమ వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించాలని భావిస్తున్నందున, అంతిమ నివాళుర్పించేందుకు నేరుగా స్మశానానికే రావాల్సిందిగా కర్నాడ్‌ కుటుంబం అంతకుముందు ఆయన అభిమానులకు, ప్రుముఖులకు విజ్ఞప్తి చేసింది. భారత సాహితీ రంగానికి మరింత వన్నె తెచ్చే విధంగా తన సొంత భాష కన్నడలో చేసిన గొప్ప రచనలకు గాను 1998లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం: రంగస్థలంలో గిరీశ్‌ కర్నాడ్‌ది ప్రత్యేక స్థానమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమవారం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతితో భారత సాంస్కృతిక ప్రపంచం చిన్నబోయిందన్నారు. ‘ఆయన మృతి విచారం కలిగించింది. అన్ని మాధ్యమాల్లో తన విలక్షణ నటన కారణంగా కర్నాడ్‌ కలకాలం గుర్తుండి పోతారు. ఆయన రచనలకు భవిష్యత్తులోనూ ప్రజాదరణ కొనసాగుతుంది..’ అని  ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా తామొక సాంస్కృతిక రాయబారిని కోల్పోయామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం
గిరీష్‌ కర్నాడ్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కర్నాడ్‌ మరణం అటు సినీ రంగానికి, ఇటు సాహితీ రంగానికి తీరని లోటు అని జగన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కర్నాడ్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

కేసీఆర్‌ సంతాపం
కర్నాడ్‌ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ నాటక, సాహిత్య, సినీ రంగానికి ఆయన చేసిన సేవ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిందని కొనియాడారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top