సత్వర న్యాయంపై సామాన్యుడికి నమ్మకం కుదిరేలా న్యాయవ్యవస్థలో సంస్కరణలు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
- సీఎంలు-సీజేల సదస్సులో చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: సత్వర న్యాయంపై సామాన్యుడికి నమ్మకం కుదిరేలా న్యాయవ్యవస్థలో సంస్కరణలు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సంతోషంగా ఉండటం, పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగించటం, సత్వర అభివృద్ధి ద్వారా అన్ని రంగాల్లో ముందుండేందుకు నాకో విజన్ ఉంది. ఇందుకు విజన్-2029 రూపొందించాం.
2020 నాటికి అందరికీ న్యాయం అన్న నినాదానికి మా మద్దతు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నా సబార్డినేట్ కోర్టులకు మౌలిక వసతులు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. బడ్జెట్‌లో కేటాయింపులు జరిపాం. అదనపు నిధులు కేటాయిస్తాం. పనులు వేగంగా జరగడం లేదు. గతంలో విడుదలైన నిధులు ఇంకా వినియోగం కాలేదు. 2019-20 నాటికి రాష్ట్రంలో అన్ని సబార్డినేట్ కోర్టులకు భవనాలు, మౌలిక వసతులు కల్పించేందుకు హైకోర్టుతో కలసి ఒక మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించాలని యోచిస్తున్నాం’ అని చంద్రబాబు చెప్పారు.
జ్యుడీషియల్ అకాడమీ నెలకొల్పాలి
దేశవ్యాప్తంగా జిల్లా న్యాయమూర్తుల నియామకంలో ఒకే తరహా విధానం అవలంబించాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నేషనల్ కోర్టు మేనేజ్‌మెంట్ విధానానికి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. న్యాయవ్యవస్థలో డిజిటైజేషన్ రావాలన్నారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పటిష్టం కోసం 14వ ఆర్థిక సంఘం వచ్చే ఐదేళ్లలో రూ. 261.35 కోట్లు మాత్రమే సిఫారసు చేసింది. హైకోర్టు కూడా లేని రాష్ట్రానికి ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి హైకోర్టులో తగిన సంఖ్యలో న్యాయమూర్తులు ఉండాలి. ఏపీ కొత్త రాజధాని ప్రాంతంలో జ్యుడీషియల్ అకాడమీతోపాటు తిరుపతి, విశాఖలో ప్రాంతీయ జ్యుడీషియల్ అకాడమీలు నెలకొల్పాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సదస్సులో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్ గుప్తా, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.