వర్సిటీల్లో పరీక్షలు రద్దు!

University exams likely to be cancelled as HRD minister asks to UGC - Sakshi

ఉన్నత విద్యపైనా కరోనా ప్రభావం 

కొత్త విద్యాసంవత్సరం అక్టోబర్‌ నుంచి ప్రారంభమయ్యే చాన్స్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జూలైలో జరగాల్సిన ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలన్నీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని అక్టోబర్‌ వరకు వాయిదా వేయనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇంటర్మీడియెట్, టెర్మినల్‌ సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను తిరిగి రూపొందించి, కొత్త విద్యా సంవత్సరం కేలండర్‌ను తయారు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)ని హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ గతంలో ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి హరియాణా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌సీ కుహాద్‌ ఆధ్వర్యంలో యూజీసీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు.

కొత్త ఎకడమిక్‌ కేలండర్‌పై కసరత్తు చేస్తున్న ఈ ప్యానెల్‌ మరో వారం రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుందని హెచ్‌ఆర్‌డీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తారు. ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులు పూర్వ ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించేలా కసరత్తు జరుగుతోంది. అయితే ఆ మార్కుల పట్ల విద్యార్థులెవరైనా అసంతృప్తిగా ఉంటే, కోవిడ్‌ తగ్గుముఖం పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రారంభం కావల్సి ఉన్న విద్యా సంవత్సరాన్ని అక్టోబర్‌ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయి.
 
ఎన్‌సీఈఆర్‌టీకి కొత్త మార్గదర్శకాలు
2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)కి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 1–5 క్లాస్‌ల వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఇన్ఫోగ్రాఫిక్స్, పోస్టర్‌ ప్రజెంటేషన్స్‌ వంటివి అక్టోబర్‌ నాటికల్లా రూపొందించాలి. 6–12తరగతుల వారికి మార్చికల్లా సిద్ధంచేయాలి. ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనేలా టీచర్లకు శిక్షణతరగతుల్ని డిసెంబర్‌నాటికి పూర్తి చేయాలి. 6–12తరగతుల విద్యార్థులకి ఆన్‌లైన్‌ బోధనకు టీచర్లకు శిక్షణ వచ్చే ఏడాది జూన్‌ నాటికల్లా పూర్తి కావాలి. ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనే సదుపాయాలు లేని విద్యార్థులకు చదువు చెప్పడానికి సిలబస్‌ను, పుస్తకాల తయారీ పని డిసెంబర్‌కల్లా పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top