కొత్తగా 9 మందికి ఛాన్స్! | Sakshi
Sakshi News home page

కొత్తగా 9 మందికి ఛాన్స్!

Published Mon, Jul 4 2016 5:31 PM

కొత్తగా 9 మందికి ఛాన్స్! - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో 9 మందికి అవకాశం కల్పించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ కు పెద్దపీట వేసే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. యూపీకి చెందిన భాగస్వామ్య పక్షం అప్నా దళ్ కు చెందిన బీసీ ఎంపీ అనుప్రియ పటేల్ కు కేబినెట్లో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. యూపీకి చెందిన పలువురు బీజేపీ నాయకులకు కూడా కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. మంత్రిపదవులు వస్తాయని భావిస్తున్న యూపీ బీజేపీ నేతలు సోమవారం అమిత్ షాను కలిశారు.

రాజస్థాన్ బికనీర్ లోక్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దళితనేత పీపీ చౌధురి కూడా కేబినెట్ లో చేర్చుకుంటారని సమాచారం. ఎస్ఎస్ ఆహ్లువాలియా, రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయల్, ఉత్తరాఖండ్ దళిత ఎంపీ అజయ్ తమ్తా, గుజరాత్ రాజ్యసభ ఎంపీ పురుషోత్తం రూపాల, మహారాష్ట్ర ఆర్పీఐ ఎంపీ రామదాస్ అథవాలే, యూపీ ఎంపీ మహేంద్ర నాథ్ పాండే, యూపీ దళిత ఎంపీ క్రిషన్ రాజ్ లకు మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. కొంత మంది మంత్రులను తప్పించే అవకాశముందంటున్నారు. అయితే సీనియర్ మంత్రులకు పదవీగండం లేదని సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన సమాచార ప్రతినిధి ఫ్రాంక్ నొరొన్హా ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement