వివాదాస్పద మతహింస నిరోధక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదముద్ర వేసింది.
నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం
వివాదాస్పద మతహింస నిరోధక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదముద్ర వేసింది. దానిని మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ‘ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మతహింస నిరోధక బిల్లుకు ఆమోదం లభించింది. దాన్ని మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తాం’ అని హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. బిల్లును బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. అందులో కొన్ని కీలక సవరణలు చేశారు. ఆ సవరణలు..
మొదటి బిల్లులో: మత విద్వేషాలు చెలరేగి అల్లర్లు జరుగుతున్నప్పుడు ఆ బాధ్యత మెజారిటీ వర్గంపైనే ఉంటుంది.
విమర్శ: ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా, ఏకపక్షంగా ఉందని బీజేపీ సహా పలు పార్టీలు తీవ్రంగా ఆక్షేపించాయి.
సవరణ అనంతరం: ఆ అల్లర్ల బాధ్యత అన్ని వర్గాల పైన సమానంగా ఉంటుంది.
మొదటి బిల్లులో: అల్లర్లు చెలరేగినప్పుడు కేంద్ర బలగాలను దింపే హక్కు కేంద్రానికి ఉంటుంది.
విమర్శ: రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది.
సవరణ అనంతరం: కేంద్ర బలగాలు కావాలని సంబంధిత రాష్ట్రం కోరినప్పుడు మాత్రమే కేంద్రం దళాలను పంపిస్తుంది. సమన్వయకర్త పాత్రను మాత్రమే పోషిస్తుంది. బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తామని బీజేపీ స్పష్టం చేసింది. ఆ బిల్లు దురుద్దేశపూరితమని, ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగానే దాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారని పేర్కొంటూ ఇప్పటికే ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రధానమంత్రికి లేఖ రాశారు.