అర్ధరాత్రి హైడ్రామా.. దినకరన్ అరెస్టు | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి హైడ్రామా.. దినకరన్ అరెస్టు

Published Wed, Apr 26 2017 8:49 AM

అర్ధరాత్రి హైడ్రామా.. దినకరన్ అరెస్టు - Sakshi

తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ (53) .. మంగళవారం అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్టయ్యారు. వరుసగా నాలుగు రోజుల పాటు దినకరన్‌ను ప్రశ్నించిన ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు.. ఎట్టకేలకు ఆయనను అరెస్టు చేశారు. సోమవారం కూడా రాత్రి 1 గంట వరకు దినకరన్‌ను ప్రశ్నించిన పోలీసులు.. మంగళవారం సైతం అదే పద్ధతిలో అర్ధరాత్రి వరకు ప్రశ్నిస్తుండటంతో అసలు అరెస్టు ఉంటుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా దినకరన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు అర్ధరాత్రి సమయంలో ప్రకటించారు. తమ వర్గానికి రెండాకుల గుర్తు తెచ్చుకోవడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న నేరంలో దినకరన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దినకరన్‌తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు. పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసినా, దినకరన్‌ను దాచిపెట్టారన్నది మల్లికార్జునపై ఉన్న అభియోగం. వీళ్లిద్దరినీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇదే కేసులో ఇంతకుముందు అరెస్టయిన మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్‌ను తాను కలిసినట్లు దినకరన్ పోలీసుల విచారణలో అంగీకరించారు. అయితే, తాను అతడికి డబ్బులు మాత్రం ఏమీ ఇవ్వలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అంటున్నారు. ఏప్రిల్ 16వ తేదీన దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో రూ. 1.3 కోట్ల నగదుతో చంద్రశేఖర్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని తాను ఎన్నికల కమిషన్ అధికారులకు ఇవ్వాల్సి ఉందని విచారణలో సుఖేష్ చెప్పాడు. అంతకుముందు మంగళవారం నాడు.. లంచాల ఆరోపణలపై దినకరన్ మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ఢిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. అసలే దినకరన్, శశికళ ఇద్దరినీ పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్న పన్నీర్ సెల్వం వర్గానికి.. ఇప్పుడు అతడి అరెస్టుతో మార్గం మరింత సులభతరమైంది.

Advertisement
Advertisement