స్క్రాప్‌లో 5వేల ఆధార్‌ కార్డులు

Thousands Of Aadhaar Cards Found In Jaipur Scrap Dealer Shop - Sakshi

జైపూర్‌ : దేశంలో ఆధార్‌ సమాచార భద్రతపై పలువర్గాల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో రాజస్తాన్‌ జైపూర్‌లోని జల్‌పుర ప్రాంతంలో ఇస్లాం అనే తుక్కు వ్యాపారి (స్క్రాప్‌ డీలర్‌) దుకాణంలో 5 వేల ఆధార్‌ కార్డులు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. ఇస్లాం షాప్‌కు వచ్చిన కొందరు అతడు కొనుగోలు చేసిన పాత పేపర్లలో ఆధార్‌ కార్డులు ఉండటం గమనించి ఆ ప్రాంత కౌన్సిలర్‌ ఇక్రాముద్దీన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఇక్రాముద్దీన్‌ ఓ ప్లాస్టిక్‌ సంచిలో ఉన్న 5వేల ఆధార్‌ కార్డులను గుర్తించాడు. వీటిని తనకు ఓ గర్తుతెలియని వ్యక్తి అమ్మినట్టు  ఇస్లాం తెలిపాడు.

ఈ ఘటనకు సంబంధించి జలపుర పోలీసులతో పాటు, పోస్టల్‌ శాఖకు సమాచారం అందజేశామని ఇక్రాముద్దీన్‌ తెలిపాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు, పోస్టల్‌ సిబ్బంది ఆ ఆధార్‌ కార్డులన్నీ జల్‌పుర పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులకు చెందినవిగా గుర్తించారు. ఆధార్‌ కార్డుల్లో ఫోన్‌ నంబర్ల ఆధారంగా ఆయా వ్యక్తులకు ఫోన్‌ చేయగా తాము ఆధార్‌ కార్డుకు చాలా కాలం క్రితమే దరఖాస్తు చేసినప్పటికి.. ఇప్పటివరకు ఆధార్‌ పొందలేదని తెలిపారు. లభించిన ఆధార్‌ కార్డులలో కొన్ని మాత్రమే పాక్షికంగా దెబ్బతినగా.. చాలా వరకు చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. డీఓఐటీ సెక్రటరీ అఖిల్‌ ఆరోరా ఈ ఘటనపై స్పందిస్తూ.. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టడానికి ప్రత్యేక బృందాన్ని పంపామని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top