
ప్రమాద స్థలం
నాలుగు రోజులపాటు జరిగే ఛాఠ్ పూజలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సమస్తీపూర్‌లోని దేవాలయ గోడ కూలిన ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు విడిచారు.
పట్నా : బిహార్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఛాఠ్ పూజలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సమస్తీపూర్‌లోని దేవాలయ గోడ కూలిన ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు విడిచారు. పురాతన కాళీమాత ఆలయంలో ఆదివారం ఉదయం ‘ఆఘ్యా’ పూజ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెరువుకు ఆనుకుని ఉన్న ఆలయ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో.. లీలా దేవి (62), బచ్చీ దేవి (62) కి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
గాయాలపాలైన కొకాయ్ యాదవ్ (55) ఇంటివద్ద మృతి చెందినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే, అతను గాయాల కారణంగానే చనిపోయారా.. మరేదైన కారణమా అని తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. మృతులకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక ఛాఠ్ పూజలో భాగంగా ఔరంగాబాద్ జిల్లాలోని సూర్యనగరి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.