గుర్మీత్‌ ఔట్‌.. తెరపైకి స్వామి నిత్యానంద.. | Sakshi
Sakshi News home page

గుర్మీత్‌ ఔట్‌.. తెరపైకి స్వామి నిత్యానంద..

Published Wed, Aug 30 2017 5:25 PM

గుర్మీత్‌ ఔట్‌.. తెరపైకి స్వామి నిత్యానంద.. - Sakshi

  • ఆశ్రమంలో మైండ్ సెట్ మార్చి ఆపై దారుణాలు
  • మహిళలు, వారి కుటుంబంపై వేధింపుల పర్వం
  • ఫిర్యాదు చేస్తే పసిగట్టి.. బాధితురాళ్లపై తప్పుడు కేసులు
  • సాక్షి, బెంగళూరు : అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ సింగ్ కు 20 ఏళ్లు (ఒక్కో కేసులో పదేళ్లు) శిక్ష పడిన నేపథ్యంలో మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ధ్యాన పీఠాధిపతి నిత్యానంద స్వామి వ్యవహరం మరోసారి వెలుగుచూసింది. ఆశ్రమంలో సేవకురాలిగా ఉన్న తనపై నిత్యానంద అత్యాచారానికి పాల్పడ్డాడని ఏడేళ్ల కిందట రామ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ బాధితురాలు తెలిపారు. ఐదేళ్ల పాటు తనపై శారీరక వేధింపులకు పాల్పడ్డాడని అమెరికాకు చెందిన మహిళ గతంలో ఫిర్యాదు చేయగా, అప్పటి కర్ణాటక సీఎం సదానంద గౌడ తీవ్రంగా స్పందించి.. నిత్యానందను అరెస్ట్ చేయాలంటూ ఆదేశించడంతో పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

    నిత్యానంద ఆస్తులతో బాధితులకు న్యాయం చేయాలి
    తనను శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎన్నో రకాలుగు వేధింపులకు గురిచేశాడని 2010 నవంబర్ లో తాను ఫిర్యాదు చేయగా, అందుకు ప్రతీకారంతో ఆ మరుసటి నెలలో తనపై తప్పుడు కేసులు బనాయించారని తాజాగా ఓ బాధితురాలు వాపోయారు. ఎవరైనా తనపై ఫిర్యాదు చేస్తే, ఆ స్టేట్ మెంట్ చదివి ఫిర్యాదు చేసిన వ్యక్తిని గుర్తించి చిత్ర హింసలకు గురిచేయడం నిత్యానందకు అలవాటేనని బాధితురాలు ఆరోపించారు. రేపిస్ట్, డేరా చీఫ్ గుర్మీత్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లుగా, నిత్యానంద ఆస్తుల విషయంలోనూ వ్యవహరించి బాధిత మహిళలకు సాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళలు కలిసికట్టుగా పోరాటం చేస్తే నిత్యానంద బెయిల్ రద్దవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గతంలో నటి రంజితతో నిత్యానంద ఎంతో చనువుగా ఉన్నప్పటి వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

    లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే స్వామి నిత్యానంద హాయిగా తన ఆశ్రయాలు, పీఠాలలో కూర్చుని వ్యాపార, వినోదాత్మక, ఇతరత్రా కార్యర్రమాలు నిర్వహిస్తూ మరికొంత మంది అమాయకులను మోసం చేస్తున్నాడని చెప్పారు. ఆశ్రమంలో తన సేవకులుగా తీసుకున్నాక మహిళలతో పాటు వారి తల్లిదండ్రులను ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేయడం ఆయనకు అలవాటు. బెంగళూరులోనే కాదు దేశంలోని ఇతర అన్ని ఆశ్రమాలలోనూ ఇదే విధంగా నిత్యానంద వేధింపులకు పాల్పడేవారని ఆమె వివరించారు.

    మైండ్ సెట్ మార్చేస్తారు
    ‘నిత్యానంద ఆశ్రయంలో చేరిన వాళ్లు తమ సొంత గుర్తింపును వదులుకుంటారు. కేవలం నిత్యానంద శిష్యులుగా మాత్రమే చెప్పుకుంటారు. ఆ విధంగా వారి మైండ్ సెట్ అప్ చేస్తారు. దీంతో నిత్యానంద చెప్పిన విధంగా అక్కడివారు నడుచుకుంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు లైంగిక దాడులు జరుగుతుంటాయి. దారుణాన్ని గుర్తించి ఫిర్యాదు చేస్తే.. బాధితులపై తప్పుడు కేసులు బనాయిస్తారు. వారి కుటుంబాన్ని జైలుపాలు చేస్తామని వేధింపులకు గురిచేస్తారని’  నిత్యానంద దగ్గర అశ్రయం పొందిన ఆ బాధిత మహిళ తెలిపారు.

Advertisement
Advertisement