కాల్పుల విరమణ కలిసొచ్చేనా..?

Suspension Of Operations By Security Forces Likely To Continue In Kashmir - Sakshi

సాక్షి, శ్రీనగర్‌ : పవిత్ర రంజాన్‌ మాసంలో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేసిన భద్రతా దళాలు కేంద్రం సూచనతో రంజాన్‌ అనంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగిస్తాయని భావిస్తున్నారు. రంజాన్‌ మాసంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టవద్దని మే 16న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రతా దళాలను కోరిన విషయం తెలిసిందే. శాంతిని కాంక్షించే ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో రంజాన్‌ పర్వదినం జరుపుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే తమపై దాడులు జరిగినా..అమాయక ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన సందర్భంలో భద్రతా దళాలు దీటుగా స్పందిస్తాయని పేర్కొంది.

అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.కాల్పుల విరమణ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి పాకిస్తాన్‌ వైపు నుంచి కాల్పులు పెరిగాయని అయితే భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని సమాచారం. గత తొమ్మిదిరోజులుగా వరుసగా జరుగుతున్న కాల్పుల హోరు ఇటీవల గణనీయంగా తగ్గినట్టు భద్రతా దళాలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో పేర్కొన్నాయి.

కేంద్రం చేపట్టిన చర్యలకు జమ్మూ కశ్మీర్‌లో సానుకూల స్పందన వస్తోందని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. మరోవైపు కేంద్ర నిర్ణయంతో జమ్ము కశ్మీర్‌లో ప్రతిఒక్కరిపై సానుకూల ప్రభావం ఉంటుందని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్‌పీ వైద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top