వారికి కూడా ‘నో’ చెప్పే హక్కు ఉంది: సుప్రీం

Supreme Court Says Sex Workers Have Right To Refuse Their Services - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పేదరికం, ఆకలి, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరుతో మోసం చేసి, నిర్భందించి వ్యభిచార కూపంలోకి నెట్టెయడంతో కొంత మంది స్త్రీలు వ్యభిచారిణులుగా మారుతుంటారు. ఇక గత్యంతరం లేక వ్యభిచారాన్నే వృత్తిగా ఎంచుకుంటున్న వారూ ఉంటారు. ఇలాంటి వారికి సమాజంలో గౌరవం ఉండదు.. అందరికీ వారంటే చులకన భావం. ఇక కొందరైతే వారి రాక్షస కోరికలను తీర్చుకునేందుకు సెక్స్‌ వర్కర్లను నానా హింసలకు గురిచేస్తుంటారు. ఏమైనా అంటే.. డబ్బులు ఇస్తున్నాం కదా అంటూ దబాయిస్తుంటారు. దీంతో చచ్చుకుంటూ వాళ్లేం చేసినా భరించాల్సిందే అనుకుంటూ ఆ అభాగ్యులు కాలం వెల్లదీస్తున్నారు. అయితే నచ్చని వారితో శృంగారానికి ‘నో’ చెప్పే హక్కు సెక్స్‌ వర్కర్లకు కూడా ఉంటుందని తేల్చుతూ సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.

1997లో దేశ రాజధానిలో ఓ సెక్స్‌ వర్కర్‌పై నలుగురు సామూహిక అత్యాచారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో కలకలం సృష్టించిన ఈ ఘటనను సుప్రీం సీరియస్‌గా పరిగణించింది. వ్యభిచారిణి అయినా తనకు ఇష్టం లేకుంటే.. శృంగారానికి ‘నో’ చెప్పే అధికారం వారికి ఉంటుందని స్పష్టం చేసింది. ఆమె అంగీకారం లేకుండా శృంగారం చేస్తే అది అత్యాచారంగానే పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇక కేసులో నిందితులైన నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. తమతో శృంగారంలో పాల్గొని డబ్బులు ఇవ్వని వారిపై సెక్స్‌ వర్కర్లు అత్యాచారం ఆరోపణలతో కేసు నమోదు చేయడానికి వీలులేదని గతంలో సుప్రీం ధర్మాసనం పేర్కొన్న విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top