సర్కారు దవాఖానాల్లో దారుణం | Supreme Court Blasts State Over Hospitals | Sakshi
Sakshi News home page

సర్కారు దవాఖానాల్లో దారుణం

Jun 13 2020 4:37 AM | Updated on Jun 13 2020 4:37 AM

Supreme Court Blasts State Over Hospitals - Sakshi

న్యూఢిల్లీ:  ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్‌–19 రోగులతో వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని కోవిడ్‌–19 ప్రత్యేక లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌(ఎల్‌ఎన్‌జేపీ)ఆసుపత్రిలో మృతదేహాలున్న బెడ్స్‌ పక్కనే కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న భయంకర దృశ్యాలున్న వీడియోను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో దీంతో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది.

కరోనా పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో ఆసుపత్రుల్లో తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, గుజరాత్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దవాఖానాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, రోగులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. అలాగే, దీనిపై స్పందించాల్సిందిగా కేంద్రానికి జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల వివరాలు, వారికి అందిస్తున్న చికిత్స ఇతర సౌకర్యాల వివరాలు, వైద్య సిబ్బంది, మౌలిక వసతుల వివరాలను కోర్టుకు అందజేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉందని, ఈ విషయంలో కేంద్రం జారీ చేసిన నిబంధనలను పాటించడం లేదని మండిపడింది. మృతదేహాలకు ఆసుపత్రులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదంది. ఢిల్లీలో తక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది.  ఆసుపత్రిలో నెలకొన్న దారుణ పరిస్థితులపై  17లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి డైరెక్టర్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. 

ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి సంబంధించిన వీడియోలను మీడియాలో చూసిన తరువాత ఈ అంశాన్ని సుమోటోగా తీసుకున్నామని పేర్కొంది. ‘పేషెంట్లకు చికిత్స చేస్తున్న వార్డులోనే మృతదేహాలను ఉంచారు. లాబీలో, వెయిటింగ్‌ ఏరియాల్లోనూ మృతదేహాలను ఉంచారు. పేషెంట్లకు ఆక్సిజన్‌ కానీ, మరే ఇతర వైద్య సదుపాయాలు కానీ కల్పించలేదు. రోగులు ఏడుస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఇది ఢిల్లీలోని 2 వేల పడకలున్న ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితి’ అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీలో పరిస్థితి ‘అత్యంత భయంకరంగా, దారుణంగా, దయనీయంగా’ ఉందని పేర్కొంది.  ఢిల్లీ ప్రభుత్వ యాప్‌లోని సమాచారం మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం బెడ్స్‌ 5,814 ఉండగా, అందులో 2,620 మాత్రమే ఆక్యుపై అయిన విషయాన్ని తమ ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement