ధరల నియంత్రణకు ఏం చేశారో చెప్పండి  

Supreme Court Asks Government Where Is Price Control - Sakshi

మాస్కులు, శానిటైజర్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల భయాందోళనలను దుకాణదారులు సొమ్ము చేసుకుంటున్నారని, మాస్కులు, శానిటైజర్లు, లిక్విడ్‌ సోప్‌లను ఎంఆర్‌పీకి మించి అధిక ధరలకు అమ్ముతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నిలదీసింది. ధరలను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.  

ఇరాన్‌లోని 250 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌  
ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయ యాత్రికులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటికే 500 మంది వెనక్కి తీసుకొచ్చామని గుర్తుచేసింది. ఇంకా 250 మంది అక్కడే ఉన్నారని పేర్కొంది. ఆ 250 మంది భారతీయులకు కరోనా పాజిటవ్‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని, వారు అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

రక్షణ పరికరాలపై వివరణ ఇవ్వండి 
కరోనా వైరస్‌ బాధతులకు వైద్య సేవలందించే డాక్టర్లకు, ఇతర సిబ్బందికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రమాణాలతో కూడిన రక్షణ పరికరాలు అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన ఓ వైద్యుడి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా బాధితులకు వైద్యం చేసేవారికి డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల మేరకు  రక్షణ పరికరాలు సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.   

ఆ పిటిషన్‌పై రెండు వారాల తర్వాతే విచారణ
దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై రెండు వారాల విచారణ చేపతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిందని సెంటర్‌ అకౌంటబిలిటీ, సిస్టమిక్‌ ఛేంజ్‌(సీఏఎస్‌సీ) అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top