కాటేసే ‘కాస్మొటిక్‌’!

Sridevi had had it done 29 times, this surgery, nowhere else, the cause of death, know its loss? - Sakshi

కాస్మొటిక్‌ సర్జరీలతో ఆరోగ్యం నాశనం

ప్రాణాలూ పోయేంత ప్రమాదం..!

హైడ్రాక్సిల్‌ మందులూ ఈ కోవలోవే

సాక్షి, హైదరాబాద్‌: అతిలోక సుందరి దివికేగింది.. మరణానికి కారణం గుండెపోటని వార్తలొచ్చినా సమయం గడుస్తున్న కొద్దీ అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి.. కాస్మొటిక్‌ సర్జరీలు కారణమని కొందరు.. బరువు తగ్గేందుకు వాడిన మందులని ఇంకొందరు అనుమానిస్తున్నారు.. ఆరోపిస్తున్నారు కూడా.. వాస్తవం రహస్యంగానే ఉండిపోవచ్చుగానీ సౌందర్య శస్త్ర చికిత్సలు, బరువు తగ్గించే మాత్రలు ప్రాణాలు తీసేంత హానికరమైనవే! గ్లామర్‌ ప్రపంచంలో అందంగా కనిపించడం అనివార్యం.

కడుపు కట్టుకోవడం, ద్రవ ఆహారమే తీసుకోవడం, గంటల తరబడి వ్యాయామం చేస్తూ అందాన్ని కాపాడుకోవడం ఓ రకమైతే.. పెరుగుతున్న వయసు, ఒళ్లు దాచుకోడానికి శస్త్ర చికిత్సలు, మందులు మింగి ఆకలిని అణచుకొని నాజూకుగా కనిపించే ప్రయత్నం చేయడం ఇంకో రకం. శ్రీదేవి రెండో రకం వ్యక్తి అని కొన్ని వార్తలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే ముక్కు ఆకారం సరిచేసుకోడానికి రైనోప్లాస్టీ చేయించుకున్న శ్రీదేవి.. తరువాత అమెరికా కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో చిన్నాచితకా కలిపి మొత్తం దాదాపు 29 ఆపరేషన్లు చేయించుకున్నారని వార్తలొస్తున్నాయి. శ్రీదేవికి దగ్గరి స్నేహితురాలు ఒకరు ఈ విషయమై ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ కూడా పెట్టారు. 

అన్ని సర్జరీలూ ప్రమాదకరమే..
కాస్మొటిక్‌ సర్జరీలతో అందం మాటేమోగానీ.. ఆరోగ్యం నాశనమవడం ఖాయమన్నది నిపుణుల మాట. రైనోప్లాస్టీ మొదలుకొని.. వక్ష సౌందర్యాన్ని పెంచుకోడానికి చేసుకునే శస్త్ర చికిత్స.. శరీరంలోని కొన్ని భాగాల నుంచి కొవ్వులు తొలగించేందుకు చేసే లైపోసక్షన్, తినే ఆహారం మోతాదును కృత్రిమంగా తగ్గించేందుకు బేరియాట్రిక్‌ సర్జరీ.. ఇలా అన్ని రకాల సర్జరీలతోనూ దుష్ప్రభావాలు బోలెడు. శస్త్ర చికిత్స జరిగిన ప్రాంతాల్లో రక్తం గడ్డకట్టడం మొదలుకుని.. రెండో గుండెగా చెప్పుకునే పిక్కల్లోని నరాల్లో రక్తప్రసరణ ఆగిపోయేంతగా అడ్డంకులు ఏర్పడటం వీటిల్లో కొన్ని మాత్రమే.

కొన్నిసార్లు పిక్కల్లో ఏర్పడిన రక్తపు గడ్డలు పైకి ప్రవహించి ఊపిరితిత్తుల్లోకి చేరి ప్రాణాలూ తీయొచ్చు. వక్ష సంపదను పెంచేందుకు సర్జరీ చేయించుకున్న వారిలో కనీసం 15 శాతం మంది నాడులు దెబ్బతిని కొన్ని స్పందనలు కోల్పోతారని గణాంకాలు చెబుతున్నాయి. శస్త్ర చికిత్సల కోసం తరచూ మత్తుమందులు తీసుకోవాల్సి రావడమూ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కొవ్వులు తొలగించేందుకు వాడే లైపోసక్షన్‌తో శరీరం లోపల ఉండే అవయవాలు దెబ్బతినేందుకు అవకాశాలెక్కువ. కొవ్వు తొలగించేందుకు ఉపయోగించే పరికరాలు అవయవాలను తాకడం వల్ల ఇలా జరుగుతుంటుంది.

మాత్రలతోనూ చిక్కులెక్కువే..
బరువు తగ్గేందుకు హైడ్రాక్సిల్‌ ఆధారిత మందులు శ్రీదేవి వాడారని వార్తలొచ్చాయి. బరువు తగ్గేందుకు లేదా ఆకలి మందగించేలా చేసేందుకు ఈ రకం మందులు వాడుతుంటారు. అనెరొక్సోరెంట్స్‌ రకం మందులు తీసుకుంటే కడుపు నిండుగా ఉందన్న భావన కలిగించేలా ఇవి మెదడులో కొన్ని మార్పులు చేస్తాయి. ఇలాంటి మందులతో రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరగడం. వాంతులు, అతిసారం, నిద్రలేమి, మలబద్దకం, ఛాతి నొప్పి, చూపు మసకబారడం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి.

సర్జరీలు చేయించుకోలేదన్న శ్రీదేవి
పదిహేనేళ్ల విరామం తరువాత ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సినిమాతో శ్రీదేవి మళ్లీ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. చిత్రం విడుదల సమయంలో తన పెదవుల ఆకారాన్ని మార్చుకోడానికి శ్రీదేవి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి.

ఈ విషయమై అనేక సందర్భాల్లో విలేకరులు శ్రీదేవిని ప్రశ్నించారు కూడా. అయితే ప్లాస్టిక్‌ సర్జరీల విషయాన్ని శ్రీదేవి పూర్తిగా ఖండించారు. తనకు ఆ అవసరం లేదని.. మంచి ఆహారం, వ్యాయామాలతోనే ముఖం కళకళలాడుతోందిగానీ.. కృత్రిమ సర్జరీలతో కాదని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. ఆమె మరణం తరువాత కూడా.. శస్త్ర చికిత్సలు మాత్రమే మరణానికి కారణం కాకపోవచ్చునని ఓ కాస్మొటిక్‌ సర్జరీ నిపుణుడు అనడం గమనార్హం.  

రజనీ కోసం శ్రీదేవి వ్రతం
తమిళ సినిమా: సినిమా వాళ్లు ఏం చేసినా స్వార్థంతోనే అనే అపవాదు ఉంది. కానీ ఈ పరిశ్రమలోనూ మానవత్వం ఉన్న వాళ్లు, స్నేహానికి గౌరవం ఇచ్చేవారూ ఉన్నారు. అందుకు నిదర్శనం శ్రీదేవియే. 2011లో రజనీకాంత్‌ అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం సింగపూర్‌కు వెళ్లారు. రజనీ త్వరగా కోలుకోవాలని అప్పట్లో శ్రీదేవి వారం రోజులు వ్రతం ఆచరించి పూజలు చేశారట. రజనీ కోలుకున్న తరువాత షిర్డీ సాయిబాబా ఆలయానికి వెళ్లి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కమల్, రజనీ ఇద్దరు నాకు మంచి మిత్రులు. రజనీకి మా అమ్మంటే చెప్పలేనంత అభిమానం. రజనీ అంటే మా అమ్మకూ అంతే. కమల్‌లాగే తానూ పెద్ద స్టార్‌ కావాలని, అందుకు ఏం చేయాలని రజనీ మా అమ్మను అడిగేవారు. నువ్వు కచ్చితంగా పెద్ద స్టార్‌వి అవుతావని ఆమె చెప్పేది’ అని ఇంటర్వ్యూలో శ్రీదేవి చెప్పారు. రూ.30వేలు పారితోషికం తీసుకోవాలనేది తన ఆశ అని అప్పట్లో రజనీ అంటుండేవారనీ, అది తలచుకుంటే ఇప్పుడూ నవ్వొస్తుందన్నారు.

శ్రీదేవి స్వగ్రామంలో విషాద ఛాయలు
సాక్షి, చెన్నై: శ్రీదేవి మరణ వార్తతో ఆమె స్వగ్రామమైన తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని మీనంపట్టిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాల్యంలోనే శ్రీదేవి మీనంపట్టి నుంచి చెన్నైకి వెళ్లినప్పటి ఫొటోను, ఆమె తల్లిదండ్రుల చిత్రపటాలను వీధుల్లో ఉంచి కొవ్వొత్తులు వెలిగించి అక్కడి ప్రజలు నివాళులర్పించారు. శ్రీదేవి గొప్ప నటిగా చెన్నైలో స్థిరపడిన తర్వాత కూడా మీనంపట్టి నుంచి తనను చూడడానికి ఎవరైనా వస్తే మంచి మర్యాదలతో స్వాగతం పలికి ఇంట్లో ఏ లోటూ రాకుండా చూసుకునేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు.

శ్రీదేవి జీవిత ఇతివృత్తంతో డాక్యుమెంటరీ తీయడానికి ఆమె అభిమాన సంఘాలు ఇటీవలే అనుమతి తీసుకుని ఆ పనులను వేగవంతం చేశాయి. ఇంతలోనే ఆమె కన్నుమూశారు.  చెన్నై ఆళ్వార్‌పేట సీఐటీ కాలనీలోని శ్రీదేవి స్వగృహం ఒకప్పుడు అభిమానుల తాకిడితో నిత్యం కళకళలాడేది. ముంబైకి మకాం మార్చాక కూడా ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా ఈ ఇంట్లోనే ఉండేవారు. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత గత ఏడాది జనవరిలో ఆమె చివరిసారిగా చెన్నైకి వచ్చి శశికళను పరామర్శించి వెళ్లారు. ఆ ఇంటి ముందు అభిమానులు శ్రీదేవి చిత్రపటాన్ని ఉంచి నివాళులర్పించారు.

రంగీలా.. బాజీగర్‌!
బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన రంగీలా, బాజీగర్, మొహబ్బతే, బాఘ్‌బాన్‌ చిత్రాల్లోని ప్రధాన పాత్ర కోసం శ్రీదేవినే ఆయా చిత్ర నిర్మాతలు సంప్రదించారు. అయితే ఆమె వాటిని తిరస్కరిం చడంతో ఆ పాత్రలు కాజోల్, ఉర్మిలా మతోండ్కర్, ఐశ్వర్యారాయ్‌ తదితరుల్ని వరించాయి.

గతంలో స్టార్‌డస్ట్‌ మ్యాగజీన్‌కు శ్రీదేవి ఇచ్చిన ఓ ర్యాపిడ్‌ఫైర్‌ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
► నేను ప్రేమించేది– పచ్చగా ఉన్న ఈ సుందరమైన ప్రపంచాన్ని
► మర్చిపోవాలనుకునే విషయం– ఈ ప్రపం చాన్ని మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో అన్న విషయాన్ని
► నేను సినిమాల్లో కోరుకునేది– మంచి స్క్రీన్‌ప్లే
► నాకు ఆసక్తి కలిగించే అంశం– మంచి స్క్రీన్‌ప్లే
► నాకున్న అతిపెద్ద ఆస్తి– నా కుటుంబం
► నా సెక్స్‌ అప్పీల్‌కు గల కారణం– జన్యువులే
► నాకు ఇష్టమైనవి– పాంపియన్‌ కుక్కపిల్లలు, పైనాపిల్‌ ఐస్‌క్రీం, సినిమా ప్యాకప్‌ సమయం
► తెలుసుకోవాలనుకునేది– చనిపోయిన తర్వాత అక్కడా మేకప్‌ రూమ్స్‌ ఉంటాయా అని.
► నా భయం, బాధ – చనిపోయాక మరో జీవితం అంటూ ఉండదేమోనని
► నా అధీనంలో ఉన్నవాటిలో ఇష్టమైనవి–  నా భావోద్వేగాలు
► నా జీవితంలో మర్చిపోలేని అనుభవం– ఛాల్‌బాజ్‌ సినిమాకు ఫిలింఫేర్‌ అవార్డు అందుకోవడం
► నా బలం– జీవితంలో జరగబోయేవాటిని ముందుగానే పసిగట్టగలగడం
► నేను అలసిపోయేలా చేసేవి– రీటేక్‌లు, రీమేక్‌లు
► ఎక్కువగా ఆనందపడేది– నా రీమేక్‌ సినిమా సూపర్‌హిట్‌ అయినప్పుడు
► నా పుట్టినరోజు– మృత్యువుకు మరో రోజు దగ్గరవ్వడం.

                       గురుగ్రామ్‌లో శ్రీదేవికి నివాళులర్పిస్తున్న నాటకరంగ కళాకారులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top