‘రక్షణ’ బడ్జెట్ | special story for army union budget 2016-2017 | Sakshi
Sakshi News home page

‘రక్షణ’ బడ్జెట్

Mar 1 2016 4:16 AM | Updated on Sep 3 2017 6:42 PM

రక్షణ రంగ బడ్జెట్ 9.76 శాతం మేరకు పెరిగింది. 2015-16 సవరించిన అంచనాలు రూ.2.33 లక్షల కోట్లు కాగా..

10 శాతం పెంపు
2016-17 బడ్జెట్ రూ.2.58 లక్షల కోట్లు
రూ.82 వేల కోట్లకు పెరిగిన మిలటరీ పింఛన్లు


న్యూఢిల్లీ: రక్షణ రంగ బడ్జెట్ 9.76 శాతం మేరకు పెరిగింది. 2015-16 సవరించిన అంచనాలు రూ.2.33 లక్షల కోట్లు కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.58 లక్షల కోట్లకు పెరిగింది. ఇక మిలటరీ పింఛన్ల మొత్తం ఏకంగా 82,000 కోట్లకు ఎగబాకింది. ఒకే ర్యాంక్ ఒకే పింఛను పథకం ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అయితే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ రంగ కేటాయింపులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ.19.78 లక్షల కోట్లలో రక్షణ రంగ బడ్జెట్ సుమారు 17.2 శాతంగా ఉంది. త్రివిధ దళాల మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల (రూ.4,287.07 కోట్లు) మాత్రమే చోటు చేసుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన పూర్తి మొత్తాన్ని వినియోగించుకోవడంలో రక్షణ మంత్రిత్వ శాఖ విఫలం కావడం ఇందుకు కారణమని భావిస్తున్నారు. త్రివిధ దళాల ఆధునీకరణకు రూ.78,586.68 కోట్లు కేటాయించారు. రఫేల్ ఫైటర్ జెట్లు, అపాచి, చినూక్, కమోవ్ హెలికాప్టర్లతో పాటు ఎం777 తేలికపాటి హోవిట్జర్ల కొనుగోలుకు సంబంధించిన లక్షలాది కోట్ల విలువైన ఒప్పందాలపై త్రివిధ దళాలు చర్చలు చివరిదశలో ఉన్న సమయంలో.. ఈ బడ్జెట్ కేటాయింపులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం బడ్జెట్ కేటాయింపుల్ని మించి ఉండటం గమనార్హం. అయితే ఈ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు ఒకేసారి కాకుండా పలు దఫాలుగా జరుగుతాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement