మద్యం మత్తులో ఘోరాలు 70–85%

Special Story On Crimes with alcohol intoxicating - Sakshi

మద్రాసు హైకోర్టు ఈ మధ్య ఒక ఆసక్తికరమైన కేసుని విచారించి తీర్పు చెప్పింది. ఆ తీర్పు వచ్చినప్పుడు మీడియాలో అంతగా హైలైట్‌ కాలేదు కానీ ఇప్పుడు ఆ తీర్పుపై ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాల్ని తెప్పించిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య కేసు చూస్తే ఆ తీర్పుని గుర్తు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పూటుగా మద్యం తాగి చేసిన నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంత అని ఒక ఔత్సాహికుడు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. జస్టిస్‌ ఎన్‌. ఆనంద్‌ ఈ కేసుని విచారించి ఖజానా నింపుకోవడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్ట్రాలు, ఆల్కహాల్‌తో సంబంధం ఉన్న నేరాలకూ బాధ్యత వహించి తీరాలన్నారు. మద్యం మత్తులో జరిగే నేరాలను పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు.

బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని తన తీర్పులో వెల్లడించారు. ఈ మధ్య కాలంలో యువత మద్యం, డ్రగ్స్‌కు బానిసలుగా మారి పెడదారి పడుతున్న ఘటనలూ ఎక్కువయ్యాయి. ఒంటి మీద స్పృహ లేని స్థితిలో రెచ్చిపోయే గుణం పెరుగుతుంది. చివరికి అది నేరాలకు దారి తీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో 70–85% మద్యం మత్తులో జరుగుతున్నవే. ఢిల్లీ నిర్భయ నుంచి తెలంగాణ నిర్భయ వరకు ఎన్నో అత్యాచారం, హత్య ఘటనలు మద్యం మత్తులో జరుగుతున్నాయన్న చేదు నిజం మింగుడు పడటం లేదు. దేశవ్యాప్తంగా అయిదింట.. ఒక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు లిక్కర్‌ అమ్మకాలే ఆధారం. అందుకే ఏ రాష్ట్రాలూ మద్య నిషేధం జోలికి పోవడం లేదు. గుజరాత్, మిజోరం, నాగాల్యాండ్, బిహార్‌ రాష్ట్రాల్లో మాత్రమే మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దశలవారీగా సంపూర్ణ మద్యపానం నిషేధం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top