
ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర వైఖరిపై పెరుగుతున్న అసహనానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. కేంద్రాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం నెలకొందని తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, పుదుచ్చేరి సీఎంలకు పిలుపు ఇస్తూ సిద్ధరామయ్య చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ‘పన్నుల పంపిణీకి ఇప్పటివరకూ 1971 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోగా, ఇప్పుడు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం 15వ ఆర్థిక సంఘాన్ని కోరడం దక్షిణాది ప్రయోజనాలకు మరింత విఘాతం కలిగిస్తుందని..దీన్ని మనం ప్రతిఘటించా’లని సిద్ధరామయ్య శుక్రవారం ట్వీట్ చేశారు. తన పోస్టును ఆయన ఆరుగురు ఇతర సీఎంల ట్విటర్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్‌ను డీఎంకే నేత ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత శశి థరూర్‌కూ సిద్ధరామయ్య ట్యాగ్ చేశారు.
ఆర్థిక సంఘానికి కేంద్రం చేసిన తాజా సిఫార్సులపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. 1971 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు పలు చర్యలు చేపట్టగా ఉత్తరాదిలో ఈ చర్యలు కొరవడటంతో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. దీంతో 2011 జనాభా లెక్కల ప్రకారం పన్నుల పంపిణీ జరిగితే తక్కువ జనాభా కలిగిన దక్షిణాదికి నిధులు తక్కువ స్ధాయిలో వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.