
ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (ఫైల్‌ఫోటో)
సగం స్ధానాల్లో బరిలో ఉంటామన్న ఎన్‌సీపీ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్ధానాలకు గాను 50 శాతం సీట్లను తమ పార్టీకి కేటాయించాలని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. మహాకూటమిలో కీలక భాగస్వామి అయిన తమ పార్టీ చీఫ్ శరద్ పవార్ గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా ఈ ప్రతిపాదనను ముందుకుతెచ్చారని ఎన్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిని దీటుగా ఎదుర్కొనేందుకు ఏడెనిమిది పార్టీలతో మహాకూటమిగా ఏర్పడాలని కాంగ్రెస్,ఎన్‌సీపీలు నిర్ణయించాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాలకే పరిమితం కావడం, ఎన్‌సీపీ నాలుగు సీట్లలో గెలిచిన క్రమంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు 24 ఎంపీ స్ధానాలను కేటాయించాలని శరద్ పవార్ కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నారు.
కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ 26 స్ధానాల్లో పోటీ చేయగా, ఎన్‌సీపీ 21 స్ధానాల్లో బరిలో నిలిచింది. మహారాష్ట్రలోని లోకసభ స్ధానాల్లో సగం స్ధానాలను శరద్ పవార్ కోరుతున్నారని, సీట్ల సర్ధుబాటు చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే సీట్ల కేటాయింపు ఖరారవుతుందని ఎన్‌సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.