ఆ పాదముద్రలు యతివేనా..

Scientists React on Yeti Footprint Photos - Sakshi

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు??

న్యూఢిల్లీ: కేవలం పురాణాల్లో, జానపద కథల్లో వినిపించే మంచుమనిషి పాదముద్రలను పోలిన గుర్తులను తాము తొలిసారి గుర్తించామంటూ భారత సైన్యం చేసిన ట్వీట్‌ ప్రపంచాన్ని విస్మయపరిచింది. యతిగా పేర్కొనే వింతజీవి ఉనికిని తాము తొలిసారిగా కనుగొన్నామంటూ ఆర్మీ చేసిన ప్రకటనపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయమై భిన్నమైన కథనాలను ప్రచురిస్తోంది.

యతి పాదముద్రలు ఇవేనంటూ ఆర్మీ విడుదల చేసిన ఫొటోలపై భారత శాస్త్రవేత్తలు, పరిశోధకుల నుంచి భిన్నమైన వాదన వినిపిస్తోంది. ఈ విషయమై బాంబే నేచురల్‌ హిస్టరీ సోసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్‌) డైరెక్టర్‌ దీపక్‌ ఆప్తే స్పందిస్తూ.. భారత ఆర్మీ ప్రకటించినందున దీనిపై దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రకృతిలో అప్పుడప్పుడు వింతలు, మిస్టరీలు చోటుచేసుకోవడం జరుగుతుందని, అయితే,  విశ్వసనీయమైన సైంటిఫిక్‌ ఆధారాలు దొరికేవరకు దీనిని నిర్ధారణ చేయకపోవడమే మంచిదని, దీనిపై మరింత చర్చ జరగాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రకృతిపరమైన పరిశోధనలు నిర్వహించే అత్యున్నత సంస్థ అయిన బీఎన్‌హెచ్‌ఎస్‌ ఇప్పటికే దేశంలోని అరుదైన జీవరాసులను గుర్తించేందుకు పరిశోధనలు సాగిస్తోంది.

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌, కోతి జాతులపై పరిశోధనలు జరుపుతున్న అనింద్య సిన్హా స్పందిస్తూ.. ఆర్మీ ప్రచురించిన ఫొటోల్లోని పాదముద్రలు యెతివి కాకపోయి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. తాజా మంచు మీద హిమాలయకు చెందిన గోధుమ రంగు ఎలుగుబంట్ల పాదముద్రలు అవి అయి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘కొన్నిసార్లు ఈ ఎలుగుబంట్లు వెనుక కాళ్ల మీద ఆధారపడి నడుస్తాయి. దీంతో వీటి పాదముద్రలు అచ్చంగా యతిని తలపించేలా ఉంటాయి. ఇవి వీటిని చూసినవారు ఇవి యతి పాదముద్రలే అయి ఉంటాయని అనుకుంటారు’ అని ఆయన వివరించారు. శాస్త్రవేత్తలే కాదు పలువురు నిపుణులు, పరిశోధకులు, నెటిజన్లు సైతం ఆర్మీ ప్రకటించిన ఫొటోల్లోని పాదముద్రలు యతివి కావని అభిప్రాయపడుతున్నారు. భారీ కాయంతో నిటారుగా ఎలుగబంటిని పోలి ఉండే యతి రెండు కాళ్లతో నడుస్తుంది కానీ, ఒకే పాదంతో అడుగులు వేసినట్టు ఈ ఫొటోల్లో ఉందని, ఈ పాదముద్రలు యతివి కాకపోయి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top