
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రాలోని చారిత్రక తాజ్‌మహల్ రంగు మారిపోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఆందోళనం వ్యక్తం చేసింది. గతంలో పసుపువర్ణంలో మెరిసే ఈ కట్టడం క్రమంగా గోధుమ, ఆకుపచ్చ వర్ణంలోకి మారుతోందని పేర్కొంది. తాజ్‌మహల్‌కు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం తక్షణమే భారత, విదేశీ నిపుణుల సాయం తీసుకోవాలని, ఆ తర్వాతే చారిత్రక కట్టడం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించింది. ‘మన వద్ద చారిత్రక కట్టడాలను పరిరక్షించే నైపుణ్యం ఉందో లేదో మాకు తెలియదు..మీ వద్ద ఆ నైపుణ్యం ఉన్నా దాన్ని వినియోగించుకోవడం లేదు..లేదా దానిపై మీకు (ప్రభుత్వం) శ్రద్ధ కొరవడింద’ని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది.
భారత్ వెలుపల విదేశీ నిపుణుల సలహాలు అవసరమైనా తక్షణమే తీసుకోవాలి..లేకుంటే తాజ్ మహల్‌కు మరింత నష్టం వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. తాజ్ మహల్ రంగు ఎందుకు మారుతోందని పిటిషనర్ ఎంసీ మెహతా సమర్పించిన ఫోటోలను చూపుతూ కోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎన్‌ఎస్ నాదకర్ణిని ప్రశ్నించింది. తాజ్ మహల్ పర్యవేక్షణను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టాలని అన్నారు. అనంతరం ఈ అంశంపై విచారణను మే 9కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్‌మహల్‌ను కాలుష్య కోరల నుంచి కాపాడాలని పర్యావరణవేత్త మెహతా సుప్రీంలో పిటిసన్ దాఖలు చేశారు.