శశికళ భర్తకు అవయవదానం వెనుక ఏం జరిగింది?

 Sasikala's Husband Gets Organ Transplant

సాక్షి, చెన్నై: జైలుపాలైన శశికళ భర్త ఎం నటరాజన్‌కు బుధవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అవయవమార్పిడి ఆపరేషన్‌ జరిగింది. 74 ఏళ్ల నటరాజన్‌కు ప్రాణాలను రక్షించే ఎంతో కీలకమైన కిడ్నీ, లివర్‌ టాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ విజయవంతంగా నిర్వహించారు. అయితే, ఆయనకు అవయవదానం చేసిన తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ టీనేజ్‌ యువకుడి దేహాన్ని బెయిన్‌డెడ్‌ స్థితిలో విమానంలో చెన్నైకి తరలించి.. నటరాజన్‌కు అవయవదానం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆపరేషన్‌ నిర్వహించిన గ్లెనీగ్లెస్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీ హాస్పిటల్‌ తోసిపుచ్చింది.

అవయవ మార్పిడి ఆపరేషన్‌ కోసం నటరాజన్‌ గత నెల గ్లోబల్‌ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల అన్నాడీఎంకే అధినేత్రి బాధ్యతల నుంచి ఉద్వాసనకు గురైన శశికళ భర్త నటరాజన్‌కు చాలాకాలంగా దూరం ఉంటున్న సంగతి తెలిసిందే. శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల కార్తీక్‌ అనే యువకుడి అవయవాలను నటరాజన్‌కు సమకూర్చారు. కార్తీక్‌ బ్రెయిన్‌ డెడ్‌ స్థితిలో ఉండగా అతన్ని చెన్నైకి తరలించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలను ఆస్పత్రి తిరస్కరించింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చిన అనంతరం.. అతను బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే, వైద్య సలహాకు వ్యతిరేకంగా కార్తీక్‌ను చెన్నైకి కుటుంబసభ్యులు తరలించారని పేర్కొంది. అయితే, తీవ్రంగా గాయపడిన అతన్ని విమానంలో తరలించారా? లేక ఎలా తీసుకువచ్చారా? అనే విషయాన్ని ఆస్పత్రి వెల్లడించలేదు. అంతేకాదు నిబంధనలకు వ్యతిరేకంగా వీఐపీ కావడంతో నటరాజన్‌కు అవయవదానం ప్రక్రియను చేపట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, అవయవ దానం స్వీకరించే 'వెయిటింగ్‌ లిస్ట్‌'లో నటరాజన్‌ టాప్‌స్థానంలో ఉన్నారని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆయనకు అవయవ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించామని ఆస్పత్రి తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top